
బాలీవుడ్ తరహాలో తెలుగులో కూడా.. ఈమధ్య ప్రముఖుల జీవిత కథలతో మూవీస్ తెరకెక్కించే ట్రెండ్ నడుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పుడు హిస్టారిక్ బయోపిక్ గా క్రేజ్ సంపాదించింది. ఇప్పటికే తెలుగులో రుద్రమదేవి, వీరప్పన్, ధోనీ లాంటి బయోపిక్స్ సూపర్ డూపర్ సక్సెస్ సాధించాయి. ఇదే కోవలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా మూవీ తెరకెక్కబోతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కేందుకు రెడీ అయ్యింది. దర్శకుడు మధుర శ్రీధర్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే జూన్ 2న సినిమా ప్రారంభంకానుంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 2018 ఫిబ్రవరి 17న ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నామని దర్శకుడు మధుర శ్రీధర్ వెల్లడించారు.
మధుర శ్రీధర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో.. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, టీఆర్ఎస్ పార్టీ స్థాపన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం, పోరాటంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, తెలంగాణ సాధన, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, బంగారు తెలంగాణ తదితర అంశాలన్నీ ఉంటాయని మధుర శ్రీధర్ తెలిపారు.