తెలుగులో కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ ‘హెబ్బులి’.. సెన్సార్‌ పూర్తికావడంతో విడుదలకు సిద్ధం!

By team teluguFirst Published Dec 27, 2022, 5:59 PM IST
Highlights

కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘హెబ్బులి’ ప్రస్తుతం తెలుగులో విడుదల కాబోతోంది. తాజాగా డబ్ వెర్షన్ కు సంబంధించిన సెన్సార్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. 
 

2017లో కన్నడలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘హెబ్బులి’ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఎస్ క్రిష్ణ దర్శకత్వం వహించగా.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeepa) - స్టార్ హీరోయిన్ అమలాపాల్ జంటగా నటించారు. సీఎమ్‌బి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఎమ్‌ మోహన శివకుమార్‌ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. బాక్సాఫీసు వద్ద కూడా కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. 

ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్‌ మరియు సెన్సార్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వి.రవిచంద్రన్‌,  పి. రవిశంకర్, కబీర్ దుహన్ సింగ్ మరియు రవి కిషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు.  ఎ. కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. సౌండ్‌ట్రాక్ మరియు ఫిల్మ్ స్కోర్‌ను అర్జున్ జన్య స్వరపరిచారు.

హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కిచ్చా సుదీప్ ఈ ఏడాది అడ్వేంచర్ ఫిల్మ్ ‘విక్రాంత్ రోణ’(Vikrant Rona)తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా కన్నడ నటుడు కిచ్చా సుదీప్ గుర్తింపు పొందారు. ‘ఈగ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కిచ్చా సుదీప్ కు ఇక్కడ మంచి మార్కెట్ ఉండటం విశేషం. నెక్ట్స్ కన్నడలో తెరకెక్కబోతున్న ‘కబ్జా’లో నటిస్తున్నారు. 

click me!