
చిత్ర పరిశ్రమని ప్రమాదాలు, విషాదకర సంఘటనలు వెంటండుతూనే ఉన్నాయి. తాజాగా కన్నడ నటుడు సూరజ్ కుమార్ అలియాజ్ ధృవన్ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. సూరజ్ తన బైక్ పై మైసూర్ - గుడ్లుపెట్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పోలిసులు అందించిన వివరాల ప్రకారం సూరజ్ తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అతడి కుడికాలు బాగా డ్యామేజ్ అయిందట. సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన బైక్ పై సూరజ్ ఊటీ వెళుతున్నాడు. మైసూర్- గుడ్ల పెట్ రహదారిపై వేగంగా ఓ ట్రాక్టర్ ని ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు తప్పింది. వేగంగా వెళ్లి ముందున్న టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
దీనితో సూరజ్ ని వెంటనే మైసూరు లోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కుడికాలు పూర్తిగా డ్యామేజ్ కావడంతో వైద్యులు దానిని తొలగించినట్లు తెలుస్తోంది. దీనితో సూరజ్ కుడికాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సూరజ్ ఎవరో కాదు.. కన్నడ లెజెండ్రీ నటుడు దివంగత రాజ్ కుమార్ కి మేనల్లుడే. రాజ్ కుమార్ సతీమణి నిర్మాత పార్వతమ్మ తమ్ముడు ఎస్ ఏ శ్రీనివాస్ తనయుడే సూరజ్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తన పేరుని ధృవన్ గా మార్చుకున్నాడు.
సూరజ్ ప్రమాదం విషయం తెలుసుకున్న నటుడు శివరాజ్ కుమార్ , ఆయన భార్య గీత ఇతర బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. సూరజ్ ప్రస్తత పరిస్థితిపై శివరాజ్ కుమార్ వైద్యులని ఆరా తీశారు.