ఎమర్జెన్సీ మూవీ.. పార్లమెంట్ ఆవరణలో షూటింగ్‌కు అనుమతి కోరిన బాలీవుడ్ బ్యూటీ కంగనా.. సాధ్యమయ్యే పనేనా..!

By Sumanth KanukulaFirst Published Dec 18, 2022, 4:39 PM IST
Highlights

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎమర్జెన్సీ. అయితే పార్లమెంట్ ఆవరణలో ఈ సినిమా షూటింగ్‌కు అనుమతివ్వాలని కంగనా కోరారు. 

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎమర్జెన్సీ. అయితే పార్లమెంట్ ఆవరణలో ఈ సినిమా షూటింగ్‌కు అనుమతివ్వాలని కంగనా కోరారు. ఈ మేరకు కంగనా లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాసినట్టుగా అధికార వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కుతున్న తన సినిమాకు పార్లమెంట్ ఆవరణలో చిత్రీకరణకు అనుమతించాలని కంగనా రనౌత్ అభ్యర్థించారు. అయితే ఆమెకు అనుమతి లభించే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. 

సాధారణంగా పార్లమెంట్ ఆవరణలో షూటింగ్ లేదా వీడియోగ్రఫీ చేయడానికి ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఉండదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఏదైనా అధికారిక కార్యక్రం లేదా ప్రభుత్వ పని కోసం జరిగితే అది వేరే అంశమని తెలిపాయి. ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్, సంసద్ టీవీలకు పార్లమెంట్ లోపల కార్యక్రమాలు లేదా కార్యక్రమాలను షూట్ చేయడానికి అనుమతి ఉందని పేర్కొన్నాయి. ప్రైవేట్ పని కోసం పార్లమెంటు లోపల షూటింగ్‌కి ప్రైవేట్ పార్టీకి అనుమతి ఇచ్చిన సందర్భం లేదని తెలిపాయి.

ఇదిలా ఉంటే.. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఎమర్జెన్సీ’ చిత్ర షూటింగ్‌ ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమైంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవితం, ఎమర్జెన్సీ నాటి పరిణామాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కంగనా కథ అందించడంతో పాటుగా, దర్శకత్వం కూడా వహిస్తున్నారు. సహా  నిర్మాతగా కూడా ఉన్నారు. ‘‘ 'ఎమర్జెన్సీ' అనేది భారత రాజకీయ చరిత్రలో అత్యంత ముఖ్యమైన కాలాలలో ఒకటి. ఇది మనం అధికారాన్ని చూసే విధానాన్ని మార్చింది. అందుకే నేను ఈ కథను చెప్పాలని నిర్ణయించుకున్నాను’’ అని కంగనా రనౌత్ గతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సమయంలో అమలులోకి వచ్చిన పవర్ డైనమిక్స్ పట్ల తాను ఆకర్షితుడయ్యానని ఆమె చెప్పారు. 

1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 21 నెలల కాలంలో, ప్రజల ప్రాథమిక హక్కులపై కఠినమైన ఆంక్షలు విధించబడ్డాయి. ఎమర్జెన్సీని ఎత్తివేసిన తర్వాత ఇందిరా గాంధీ లోక్‌సభ ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమెకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని అందుకుంది.

click me!