
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాలు చేశారు. కమల్ హీరోగా చేసిన చాలా చిత్రాల్లో రజనీకాంత్ విలన్ గా చేశారు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి హీరోలుగానూ నటించారు. కానీ అనుహ్యంగా వీరిద్దరు విడిపోయారు. ఇక తాము కలిసి నటించబోమని స్పష్టం చేశారు. మరి ఆ నిర్ణయం వెనుక కారణం ఏంటి? అసలేం జరిగిందనేది చూస్తే.
కమల్ హాసన్ తాజాగా `థగ్ లైఫ్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రలు పోషించారు. గురువారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది.
కథ రొటీన్‌గా, సాగదీసినట్టుగా ఉండటం మైనస్‌గా నిలిచింది. రెహ్మాన్ బీజీఎం పెద్ద మైనస్ అంటున్నారు. కమల్ నటన, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ లో ఎమోషన్స్ సినిమాకి ప్రధాన బలం. అవి ఆడియెన్స్ ని ఎంతగా హుక్ చేస్తాయనేది చూడాలి.
ఈ సందర్భంగా కమల్ హాసన్, రజనీకాంత్‌కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. వీరిద్దరు కెరీర్ ప్రారంభంలో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సుమారు ఇరవై వరకు సినిమాలు వచ్చాయి.
కానీ 1980 తర్వాత నుంచి కలిసి నటించడం లేదు. ఇద్దరు కలిసి సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటనేది బయటకు వచ్చింది. కమల్ హాసన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ నిర్మాత చేసిన మోసం దీనికి కారణమని తెలిపారు.
1980 తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఓ సినిమాలో నటించాల్సి వచ్చింది. ఓ బడా నిర్మాత చాలా పెద్ద ప్రాజెక్ట్ ని సెట్ చేశారు. అప్పటికీ కమల్ హాసన్ తీసుకునే పారితోషికం రెండున్నర లక్షలు.
అయితే ఈ మూవీ చాలా పెద్ద బడ్జెట్ చిత్రం, కాస్ట్ ఎక్కువవుతుందని చెప్పి ఆ నిర్మాత తక్కువగా ఇచ్చారట. కమల్ హాసన్‌కి 1.75లక్షలు పారితోషికం ఇచ్చారట. సరే లే పోని అనుకుని కమల్ ఓకే చెప్పాడట.
ఆ తర్వాత నీకు ఎంత ఇచ్చాడని రజనీకాంత్‌ని అడిగాడట కమల్. లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని చెప్పాడట రజనీ. కేవలం 25వేలు మాత్రమే ఎక్కువతో ఇద్దరు హీరోలను తీసుకుని సినిమా చేశాడు. ఇది అన్యాయమని భావించిన కమల్, రజనీ.. ఒక నిర్ణయానికి వచ్చారట.
ఇక తాము ఇద్దరం కలిసి సినిమా చేయోద్దని నిర్ణయించుకున్నారట. అప్పటికే కమల్ హాసన్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. రజనీకాంత్‌కి అప్పుడప్పుడే స్టార్ ఇమేజ్ వస్తుంది. ఏం పర్లేదు, నీకు సొంతంగా సినిమా చేసే కెపాసిటీ ఉందని కమల్ చెప్పడంతో రజనీ కూడా ఓకే అన్నారు.
ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుని ఆ సమయంలోనే మీడియాకి ప్రకటించారట. ఇకపై తాము ఇద్దరం కలిసి నటించడం లేదని అధికారికంగా ప్రకటించారట. అంతే ఆ దెబ్బతో నిర్మాతలు క్యూ కట్టారని, మూడు లక్షల పారితోషికం ఇచ్చేందుకు వచ్చారని తెలిపారు కమల్ హాసన్. రజనీ, తాను చెరో మూడు లక్షల పారితోషికం అందుకున్నామని తెలిపారు.
మళ్లీ ఇప్పుడు తామిద్దరం కలిసి సినిమా చేయాలంటే ఒకటి తాను అయినా నిర్మించాలి, లేదంటే రజనీ అయినా నిర్మాతగా మారాలి. మిగిలిన ఎవరూ సినిమా చేయలేరని తెలిపారు కమల్ హాసన్. `థగ్ లైఫ్` మూవీ రిలీజ్ వేళ ఆయన పాత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో కమల్ ఈ విషయాన్ని వెల్లడించారు.