
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తమిళ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన క్వీన్ సినిమా కు రీమేక్ ఇది. తెలుగులో తమన్నా, తమిళ్‌లో కాజల్, కన్నడలో పరూల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్‌లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మొదట్లోనే షూటింగ్ పూర్తయినా రిలీజ్ విషయంలో మాత్రం లేటవుతోంది. అందుకు కారణం సెన్సార్ సమస్యలు అని సమాచారం.
పారిస్ పారిస్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా కావటంతో కొన్ని విజువల్ గా అసబ్యంగా ఉండే సన్నివేశాలు, చాలా డైలాగ్స్‌ను తొలగించాల్సిందిగా సెన్సార్ సభ్యులు సూచించారు. సీన్స్‌ను బ్లర్ చేయాలని అన్నారు. దాంతో చిత్రయూనిట్ రివైజ్ కమిటీని ఆశ్రయించేందుకు రెడీ అవుతోంది. రివైజింగ్ కమిటీ తమిళ క్వీన్‌కు క్లియరెన్స్ వస్తే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.
రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మను కుమరన్ నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఐఫిల్ టవర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అమాయకంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల ఎలా శక్తివంతమైన మహిళగా మారుతుంది అనేది ‘ప్యారిస్ ప్యారిస్’ కథ. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. మైఖెల్ టబూరియస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.