
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం గురించి బయటకి వస్తున్న ఒక్కో అంశం ఆసక్తిని పెంచేలా ఉంది. ఇండియన్ నేచర్, మట్టి కథ అని రాంచరణ్ ఆల్రెడీ చెప్పారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఆకట్టుకునే బలం ఈ కథలో ఉందని చరణ్ తెలిపాడు.
ఈ చిత్రం ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం బుచ్చిబాబు అండ్ టీం ఉత్తరాంధ్ర యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
తాజా సమాచారం మేరకు ఆర్ సి 16లో ఒక బాలీవుడ్ స్టార్ విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ ఎవరో కాదు జాన్ అబ్రహం. జాన్ అబ్రహంని బుచ్చిబాబు ఈ చిత్రంలో విలన్ పాత్రకి ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు.
జాన్ అబ్రహం తొలిసారి సౌత్ చిత్రం చేయనుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం మాట్లాడుతూ తానూ హిందీ సినిమా హీరోని అని హిందీలో మాత్రమే నటిస్తాను అని తెలిపాడు. తెలుగులో కానీ సౌత్ లో కానీ తాను నటించనని తెలిపాడు. చాలా మంది హిందీ నటులు బిజినెస్ కోసం సౌత్ లో నటిస్తుంటారు. కానీ తానూ మాత్రం అలా చేయనని అన్నాడు.
అంత ఖచ్చితంగా చెప్పిన జాన్ అబ్రహం ఇప్పుడు నిజంగానే రాంచరణ్ సినిమా చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఒక క్లారిటీకి రాలేం. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.