
పొలిటికల్ గా బిజీగా ఉంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు.
ఇంతలో మరో క్రేజీ న్యూస్ వచ్చేసింది. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'వినోదయ సిత్తం' రీమేక్ లో నటించబోతున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మనిషి రూపంలో వచ్చిన దేవుడిగా పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ ప్లే చేయబోతున్నాడు.
ఈ చిత్రం విషయంలో పవన్ ఫ్యాన్స్ లోనే వ్యతిరేకత ఉంది. పవన్ కళ్యాణ్ చాలా కాలంగా ఎక్కువగా రీమేక్స్ చేస్తున్నారు. ఇటీవల రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. పైగా ఈ చిత్రం కమర్షియల్ అంశాలకు దూరంగా ఉండే చిత్రం. దీనితో ఈ చిత్రం చేయవద్దని ఫ్యాన్స్ ససేమిరా అంటున్నారు. కానీ పవన్ మాత్రం ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా షురూ కానుంది. ఈ చిత్రంలో పవన్ భగవంతుడిగా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం పవన్ నియమనిష్టలతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మాంసాహారాన్ని పక్కన పెట్టి శాఖాహారం మాత్రమే భుజించబోతున్నారట. దేవుడి పాత్ర కాబట్టి స్వచ్ఛత, దైవత్వం కోసం పవన్ కొన్ని నియమాలు పాటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ఇలాగే చేసేవారు. పౌరాణిక పాత్రలు పోషించే సమయంలో ఎన్టీఆర్ ఎంతో నిష్టగా ఉండేవారట. అలాగే అన్నమయ్య చిత్రంలో సుమన్ వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించారు. సుమన్ కూడా ఇదే తరహాలో శాకాహారం మాత్రమే తీసుకుంటూ నేలపై పడుకునేవారట.
గతంలో గోపాల గోపాల చిత్రంలో పవన్ కృష్ణుడి పాత్రలో నటించారు. అప్పుడు కూడా పవన్ ఇలాంటి నియమాలే పాటించారు. దేవుడి లుక్ కోసం తన ఫిజిక్ ని మార్చుకునేందుకు ఫిట్ గా మారేందుకు పవన్ జిమ్ కసరత్తులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించనున్నారు.