బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. సీరియల్ నటుడు ఇంద్రనీల్ కంటెస్ట్ చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. తనను బిగ్ బాస్ మేకర్స్ రెండుసార్లు ఇంటర్వ్యూ చేశారంటూ ఇంద్రనీల్ కీలక విషయాలు వెల్లడించాడు..
సూపర్ హిట్ సీరియల్స్ చక్రవాకం, మొగలి రేకులు తో ఫేమస్ అయ్యాడు నటుడు ఇంద్రనీల్. ఆయనకు బుల్లితెర ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ఉంది. కాగా ఇంద్రనీల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్ట్ చేస్తున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. నెల రోజులకు పైగా ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై ఇంద్రనీల్ స్వయంగా స్పందించాడు. తాజా ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు.
బిగ్ బాస్ నిర్వాహకులు తనను సంప్రదించిన మాట వాస్తవమే... కానీ నేను వెళ్లడం లేదని ఆయన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ఇంద్రనీల్ మాట్లాడుతూ... నేను అభిమానులకు చెప్పేది ఏమిటంటే నేను బిగ్ బాస్ షోకి రావడం లేదు. బిగ్ బాస్ నిర్వాహకులు నాకు కాల్ చేశారు. అప్పుడు నా భార్య కూడా పక్కనే ఉంది. నాకు ఆసక్తి లేదని వాళ్లతో చెప్పాను. కానీ ఒకసారి ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి అన్నారు.
ఇంటర్వ్యూ కి వెళ్ళాను. మరో ఇంటర్వ్యూకి రమన్నారు. అప్పుడు కూడా వెళ్ళాను. ఈసారి ముంబై వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. సెకండ్ ఇంటర్వ్యూ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లాలనే ఆసక్తి నాకు కలిగింది. మొదటి ఇంటర్వ్యూలో వాళ్ళు విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. షోకి కావలసిన కంటెంట్ కోసం ఏవేవో అడిగారు. బిగ్ బాస్ షో అప్ కమింగ్ ఆర్టిస్ట్స్ కి, షోకి వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి హెల్ప్ కావచ్చు. నాకున్న ఇమేజ్ కి బిగ్ బాస్ సెట్ కాదు.
షోకి వెళ్ళాక గొడవలు పడాలి. నామినేషన్స్ లో గట్టిగా అరవాలి. ఇవన్నీ తలచుకుని బిగ్ బాస్ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. నేనేదో పెద్ద ఆర్టిస్ట్ అని కాదు. బిగ్ బాస్ షోకి వెళ్ళాక మనకు ఎలాంటి ఇమేజ్ వస్తుందో చెప్పలేం, అని అన్నాడు. దాంతో ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇంద్రనీల్ భార్య మేఘన అడ్డుకున్నారని కూడా ఓ వాదన గతంలో తెరపైకి రావడం విశేషం..
సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. వరుసగా ఆరోసారి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఈసారి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం. సీజన్ 1కి ఎన్టీఆర్, సీజన్ 2కి నాని హోస్ట్స్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే..