
`కేజీఎఫ్`(KGF) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కన్నడ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇది కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళం వంటి భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలై భారీ వసూళ్లని రాబట్టింది. `బాహుబలి` తరహాలోనే సెకండ్ పార్ట్ పై ఆసక్తినిపెంచింది. దీంతో రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు గతంలో చిత్ర బృందం ప్రకటించింది.
కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో `సలార్` చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు చిత్రనిర్మాణ సంస్థ ఇతర సినిమాలతో బిజీగా ఉంది. కానీ హీరో యష్(Yash) మాత్రంఈ చిత్రం కోసమే వెయిట్ చేస్తున్నారు. దాదాపు రెండేళ్లు ఈ సినిమా కోసమే మరో సినిమా చేయకుండా వెయిటింగ్‌లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. `కేజీఎఫ్ 2` విడుదలయ్యాకనే మరో సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎలాంటి అప్‌డేట్లు లేకపోవడంతో ఓ రకంగా `కేజీఎఫ్ 2`(KGF2)ని అంతా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో మేలుకున్న యూనిట్ ఇప్పుడు దైవదర్శనాలతో, ఆధ్యాత్మిక సేవలో బిజీ అయ్యారు. తాజాగా మంగళవారం `కేజీఎఫ్ 2` టీమ్ హీరోయష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కొల్లూర్ శ్రీ మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతోపాటు అనెగుడ్డే శ్రీ వినాయక టెంపుల్‌ని యష్, ప్రశాంత్ నీల్‌తోపాటు ఇతర చిత్ర యూనిట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో యష్ ఇంకా `కేజీఎఫ్` చిత్రంలోని లుక్ లోనే గెడ్డంతో ఉండటం విశేషం.
యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన `కేజీఎఫ్ 2` చిత్రాన్ని ప్రశాంత్ నీల్ రూపొందించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగిదూర్ నిర్మించారు. ఇందులో సంజయ్ దత్ విలన్ పాత్రనిపోషిస్తుండగా, రవీనా టండన్, ప్రకాష్‌రాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నారు. తొలి భాగం 2018 డిసెంబర్ 21న విడుదలైన విషయం తెలిసిందే.