Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దర్శకుల పరిస్థితి దారుణం..!

By Sambi ReddyFirst Published May 25, 2022, 2:46 PM IST
Highlights

పవన్ కళ్యాణ్ తో చిత్రాలు చేసిన డైరెక్టర్స్ కి సినిమాలు లేవు. ఆయన కమ్ బ్యాక్ చిత్రాలు చేసిన దర్శకులు  అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. 
 


2014లో జనసేన (Janasena) పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 2019లో మొదటి సారి ఎన్నికల బరిలో దిగారు. ఈ నేపథ్యంలో ఇకపై సినిమాలు చేయను, ప్రజాసేవకే జీవితం అంకితం అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ (Pawan Kalyan) ఓడిపోగా... కేవలం ఒక్క అసెంబ్లీ సీటు జనసేన పార్టీ గెలుచుకుంది. దీంతో పవన్ తన ఒట్టు గట్టు మీద పెట్టి ముఖానికి రంగేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. 2019 చివర్లో కమ్ బ్యాక్ ప్రకటించారు. మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగుతున్న పవన్ పొలిటికల్ మైలేజ్ కోసం సోషల్ సబ్జెక్ట్ తో కూడిన పింక్ రీమేక్ ఎంచుకున్నారు. 

హిందీ చిత్రం పింక్ రీమేక్ ని తెలుగులో వకీల్ సాబ్ (Vakeel Saab) గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ చిత్రం అనంతరం వరుసగా మూడు చిత్రాలు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఒప్పుకున్న చిత్రాలు పక్కనపెట్టి మరో రీమేక్ భీమ్లా నాయక్ పూర్తి చేసి విడుదల చేశారు. ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ కర్త కర్మగా వ్యవహరించారు. స్క్రీన్ ప్లే మాటలు సమకూర్చడం తో పాటు పర్యవేక్షకుడిగా ఉన్నారు. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ (Bheemla Nayak) దర్శకులైన వేణు శ్రీరామ్, సాగర్ కే చంద్ర కొత్త చిత్రాలు ప్రకటించలేదు. ఈ ఇద్దరు దర్శకులకు కనీస అవకాశాలు రావడం లేదు. దిల్ రాజు కటాక్షంతో సినిమాలు చేస్తున్న వేణు శ్రీరామ్ పరిస్థితి అయోమయంగా ఉంది. దిల్ రాజుతో ఆయనకు విబేధాలు తలెత్తాయనే వాదన ఉంది. నిజానికి దిల్ రాజు వేణు శ్రీరామ్-అల్లు అర్జున్ కంబినేషన్ లో ఐకాన్ అనే మూవీ సెట్ చేశాడు. అనేక కారణాల వలన ఈ మూవీ కార్యరూపం దాల్చడం లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం ఇమేజ్ రీత్యా వేణు శ్రీరామ్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. 

మరోవైపు సాగర్ కే చంద్ర పరిస్థితి కూడా ఇంతే. వకీల్ సాబ్ కంటే భీమ్లా నాయక్ తక్కువ వసూళ్లు రాబట్టింది. దానికి తోడు భీమ్లా నాయక్ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ ఖాతాలో చేరింది. అలాగే మూవీ ఏపీలో నష్టాలు మిగిల్చింది. తెలంగాణాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కి చేరింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సూపర్ హిట్స్ అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తుంటే... ఆ చిత్రాల దర్శకులకు మాత్రం అవకాశాలు రావడం లేదు. 

click me!