
బాలకృష్ణ లాంటి మంచి మనిషి, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన సోల్ ఉన్న మనిషి తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ హీరోగా రూపొందిన `వీరసింహారెడ్డి` చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్‌గా, దునియా విజయ్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం ఒంగోల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో గోపీచంద్ మలినేని బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే `వీరసింహారెడ్డి` చిత్రంలోని క్లైమాక్స్ లో ఫైట్ సీన్ చిత్రీకరించే సమయంలో జరిగిన ఘటన గురించి చెప్పారు. క్లైమాక్స్ లో చివరి ఫైట్ చిత్రీకరించే సమయంలో ఒక నిమిషం ముందు `జైబాలయ్య` పాట విడుదలైందట. ఆ వెంటనే షూట్ చేస్తుండగా కింద పడిపోయాడట. అది చూసి అంతా షాక్ అయ్యారట.
ఆ వెంటనే టక్కున లేచి షాట్ ఓకే అన్నారట. అది చూసి యూనిట్ అందరికి మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు గోపీచంద్ మలినేని, ఆయనలోని కమిట్‌మెంట్, వర్క్ డెడికేషన్ కి నిదర్శనమని తెలిపారు. ఇది కదా హీరోయిజం అనిపించింది. ఆ క్షణంలో తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని, అప్పుడు అర్థమైంది బాలయ్య బాబు మాస్ గాడ్ అయ్యింది ఇందుకే కదా అని తెలిపారు గోపీచంద్. జనవరి 12న వీరసింహారెడ్డి విజృంభించబోతున్నారని చెప్పారు. అదే సమయంలో ఒంగోల్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి తన కళ సాకారం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు గోపీచంద్.