
హిందీ చిత్రం 'గంగూబాయి కతియావాడి' ఆ మధ్యన భీమ్లా నాయక్‌కు పోటీగా విడుదల అయ్యింది. బాలీవుడ్‌లో అయితే ఈ సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది. రిలీజైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంటోంది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ఇది. మాఫియా క్వీన్ గంగూబాయ్ కతియావాడి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజైంది.
బాలీవుడ్ లో మంచి హిట్టైన ఈ చిత్రం అతి తక్కువ కాలంలోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి గంగూబాయ్ కతియావాడి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. థియేటర్‌లో సినిమా చూడని వారు, మరోసారి గంగూబాయ్ కతియావాడి చూడాలనుకున్నా మంగళవారం(ఏప్రిల్ 26) నుంచి చూడవచ్చు.
ఇక గంగూబాయి బయోపిక్ కథ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రాసుకున్నది కాదు. ఎస్ హుస్సేన్ జైదీ, జేన్ బార్గ్స్ అనే ఇద్దరు రైటర్స్ ముంబాయిలోని ప్రతీ కోణాన్ని పరిశీలించి అండర్‌వరల్డ్ ప్రపంచం గురించి అందరికీ చెప్పే 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఒక చాప్టర్ 'గంగూబాయి'. పుస్తకంలోని రియాలిటీని ఏ మాత్రం చెరిపేయకుండా దీనిని సినిమా రూపంలో తెరకెక్కించాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. పైగా దీని కథ చాలావరకు ప్రేక్షకులకు కూడా తెలుసు. హీరోయిన్ అవ్వాలనుకునే కలతో ముంబాయికి పారిపోయి వచ్చేసిన గంగూబాయి. ఒకరితో ప్రేమలో పడుతుంది. అతడి వల్ల ముంబాయిలోని రెడ్ లైట్ ఏరియాలో చిక్కుకుపోతుంది. ఆ తర్వాత కమాతిపుర అనే రెడ్ లైట్ ఏరియాకే మాఫియా క్వీన్‌గా మారుతుంది.