ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్స్’ తర్వాత ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) ఈరోజే ఫస్ట్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. వీరి ప్రసంగాలకు ఆ ఈవెంట్స్ వేదికలు కానుండగా.. అందరిలో ఆసక్తి నెలకొంది.
‘ఆర్ఆర్ఆర్’ దెబ్బతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఆస్కార్స్ ఈవెంట్ సందర్భంగా హాలీవుడ్ ఏరియాలో ఈ ఇద్దరి స్టార్స్ పేరు మారుమోగిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లోనూ హాలీవుడ్ మీడియా, స్టూడియోల్లో తమదైన శైలిలో మాట్లాడి ఆకట్టుకుంటున్నారు. ఎట్టకేళకు Oscars 2023 అవార్డును దక్కించుకోవడంలో కృషి చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇండియాకు తిరిగి వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా ఈరోజు ఉదయమే ఇండియాకు చేరుకుంది.
అయితే, ఆస్కార్స్ వేడుక తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికన వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద సక్సెస్ లో భాగమైన ఇండియన్స్ కు హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెప్పారు. ఇండియాలో అడుగుపెట్టిన సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద మీడియాతోనూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఎక్కడా పూర్తి స్థాయిలో స్పీచ్ ఇవ్వలేదు. ఇక ఈరోజే మరికొద్ది గంటల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్స్ తర్వాత ఫస్ట్ టైమ్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, ఆడియెన్స్ వారి ప్రసంగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రెండ్రోజుల కిందనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్స్ ఈవెంట్ ను ముగించుకొని ఇండియాకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక వేడుక తర్వాత ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరగనున్న విశ్వక్ సేన్ కొత్త సినిమా ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు ఫ్యాన్స్. వేదికపై తొలిసారిగా ఎన్టీఆర్ స్పీచ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు... ఇప్పటికే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఎంఎం కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాల భైరవ, రాజమౌళికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఆస్కార్ విన్నింగ్ తర్వాత ఫస్ట్ ఆ న్యూస్ ను తన భార్యతోనే షేర్ చేసుకున్నానని తెలిపారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ స్పీచ్ పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈరోజే ఫస్ట్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. ఈరోజే ఇండియాకు తిరిగొచ్చిన చెర్రీ ఢిల్లీలోనే ల్యాండ్ అయ్యారు. ఆయనకు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ పలికారు. మార్చి 17, 18న జరగనున్న ఇండియా టుడే కాన్ క్లేవ్ (India Today Enclave) ఈవెంట్ కు రామ్ చరణ్ ను హాజరయ్యేందుకు ఢిల్లీలోనే ఆగారు. ఈఈవెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జాన్వీ కపూర్, మలైకా అరోరా హాజరు కానున్నారు. ఆయా రంగాల నుంచి 50 మంది ప్రముఖులు ఈ సదస్సుకు రానున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో చరణ్ ను ఘనంగా సత్కరించబోతున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో చెర్రీ ఫస్ట్ స్పీచ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈవెంట్ అనంతరం చరణ్ హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.
ఢిల్లీలో ల్యాండ్ అయిన చరణ్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల పాట గెలిచిందన్నారు. 'నాటు నాటు' విజయానికి ప్రజల ప్రేమే కారణమన్నారు. ఇది అభిమానుల పాట. ఇది ప్రజల పాట. విభిన్న సంస్కృతులు, దేశాలకు చెందిన వారు దీనిని సొంతం చేసుకున్నారన్నారు. ఈ పాటను ఆస్కార్‌కు తీసుకెళ్లింది వారేనని నేను బలంగా నమ్ముతున్నానని తెలిపారు. అలాగే కీరవాణి, చంద్రబోస్, రాజమౌళికి, ఆడియెన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.
ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డు ఇండియా సొంతమైన సందర్భంగా భారతీయులు గర్విస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’ అవార్డును గెలుచుకోవడం ఇండియన్ సినిమా స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లిందని ప్రముఖులు అభినందిస్తున్నారు. మార్చి 13న అమెరికాలోని డాల్బీ థియేటర్ లో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. ఆస్కార్ వేదికపై స్పీచ్ తో ఆకట్టుకున్నారు.