దిశాని ఆపేయండి.. హైకోర్ట్ ని ఆశ్రయించిన బాధితురాలు తండ్రి

By Aithagoni RajuFirst Published Oct 10, 2020, 10:08 AM IST
Highlights

దిశ ఎన్‌కౌంటర్‌ ప్రధానంగా రూపొందుతున్న `దిశ` సినిమాని  ఆపేయాలని కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డ్ ని ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్ట్  ని ఆశ్రయించారు. 

రామ్‌గోపాల్‌ వర్మ సినిమాలకు వరుసగా బ్రేక్‌ పడుతున్నాయి. ఆ మధ్య `మర్డర్‌` సినిమాని నిలిపివేయాలని కోర్ట్ తీర్పు చెప్పింది. తాజాగా మరో షాక్‌ తగిలింది వర్మకి. ప్రస్తుతం ఆయన  రూపొందిస్తున్న `దిశా` సినిమాని కూడా ఆపివేయాలని దిశా తండ్రి హైకోర్ట్ ని ఆశ్రయించారు. 

హైదరాబాద్‌ శివారులో సంచలనం సృష్టించిన దిశా ఘటన యావత్‌ దేశాన్ని కలచి వేసిన  విషయం తెలిసిందే. ఈ ఘటనపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ `దిశ` పేరుతోనే సినిమాని తీస్తున్నారు.  దిశ ఎన్‌కౌంటర్‌ ప్రధానంగా ఇందులో చూపించబోతున్నారు. ఇదిలా  ఉంటే దీన్ని ఆపేయాలని కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డ్ ని ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్ట్  ని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ని న్యాయమూర్తి జస్టిస్‌ పి. నవీన్‌రావు శుక్రవారం విచారించారు. 

దిశపై లైంగిక దాడి, అనంతరం హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్‌  చేసిన ఘటన సుప్రీంకోర్ట్ పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరఫు న్యాయవాది నివేదించారు. ఇదిలా ఉంటే సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌ ఎలాంటి వినతిపత్రం  సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వరరావు  నివేదించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డ్ ని దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. 

రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న ఈ సినిమాకి ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా,  నట్టిక్రాంతి, నట్టి కరుణ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సోనియా అకుల, ప్రవీణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

click me!