`కేజీఎఫ్` సినిమాపై దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి. దీంతో తాజాగా తన వ్యాఖ్యలపై దర్శకుడు స్పందించారు. ఊహించని విధంగా సమాధానం చెప్పారు. ఆ విషయంలో తగ్గేదెలే అని స్పష్టం చేశాడు.
`కేరాఫ్ కంచెరపాలెం` చిత్రంతో టాలీవుడ్‌లో పాపులర్ అయ్యాడు దర్శకుడు వెంకటేష్ మహా. ఈ చిత్రంతో ట్రెండ్ సెట్టర్‌గానూ నిలిచారు. ఆ తర్వాత `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రంతో మెప్పించారు. దర్శకుడిగా ఈ రెండు చిత్రాలతో అలరించిన ఆయన ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ కోసం `మోడర్న్ లవ్ హైదరాబాద్` అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నాడు.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా దర్శకుడు వెంకటేష్ మహా `కేజీఎఫ్` చిత్రంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయల సమక్షంలోనే వెంకటేష్ మహా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. దీనికి వాళ్లు కూడా నవ్వులు పూయించారు. అయితే ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దర్శకుడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రోల్స్ కి గురవుతున్నారు. రెండు సినిమాలకే ఇంత ఓవరాక్షన్ ఎందుకని, నీవు అసలు అలాంటి సినిమాలు తీసి చూపించమని, కన్నడ ఫ్యాన్స్ ఏకంగా యష్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై ఇప్పటికే స్పందించిన నందిని రెడ్డి క్షమాపణలు చెప్పింది. తాజాగా దర్శకుడు వెంకటేష్ మహా స్పందించారు. తనదైన స్టయిల్‌లో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. తన అభిప్రాయం విషయంలో తగ్గేదెలే అని తెలియజేశాడు. కానీ ఓ విషయానికి మాత్రం సారీ చెప్పాడు. `కేజీఎఫ్` సినిమా కూడా చాలా మందికి నచ్చలేదు, వారంతా నాలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు, నేను మాట్లాడింది కరెక్టే అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. అయితే తాను సినిమాలోని కల్పిత పాత్రని విమర్శించాను, తప్ప రియల్ లైఫ్‌లో ఏ వ్యక్తిని, ఏ క్రియేటివ్ పర్సన్‌ని విమర్శించలేదు, తక్కువ చేయలేదు. కాకపోతే తాను వాడిన భాష తప్పు, మాట్లాడిన పదాలు సరిగా లేవని ఆయన తెలిపారు. ఆ విషయంలో తాను క్షమాపణనలు తెలియజేస్తున్నానని తెలిపారు.
ఆయన ఇంకా చెబుతూ, `నా సినిమాలు నచ్చిన వారు, నా ఒపీనియన్ నచ్చిన వాళ్లు సందేశాలు పంపారు. వాళ్లందరి తరఫున నా వాయిస్ అది. నేను అన్న మాటలను ఒక రియల్ లైఫ్ పర్సన్‌కి ఆపాదించి చూడటమనేది నా అభిప్రాయాన్ని మీరు వింటున్న విధానం వల్ల వచ్చిన సమస్య అయి ఉంటుంది. ఒక ఎమోషన్‌లో ఒక కల్పిత పాత్రని దూషించాను. దానికి రియల్ పర్సన్ అయినటువంటి నన్ను ఎన్నో రకాలుగా దూషిస్తున్నారు, తప్పుడు ఇమేజ్‌ని క్రియేట్ చేస్తున్నారు. అసభ్యంగా దూషిస్తున్నారు. ఇది కొత్త కాదు, చాలా సార్లు చూశాను, ఇలాంటి ఎన్నో సంఘటనల కారణంగా నాకు అలాంటి అభిప్రాయం ఏర్పడింది. అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని, ఒకేలా చూస్తారని ఆశిస్తున్నాను` అని తెలిపారు దర్శకుడు వెంకటేష్ మహా.