
దాదాపు ఏడాది కాలంగా శంకర్ భారతీయుడు 2 ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యారు. వివాదాలతో ఆగిపోయిన ఆ చిత్రాన్ని నిర్మాతలు పట్టాలెక్కించారు. దర్శకుడు శంకర్ తో సయోధ్య కుదుర్చుకున్నారు. భారతీయుడు 2 మొదలయ్యాక గేమ్ ఛేంజర్ షూటింగ్ నెమ్మదించింది. భారతీయుడు 2 సెట్స్ లో ఎక్కువగా ఉంటున్న శంకర్ గేమ్ ఛేంజర్ మూవీని అసిస్టెంట్స్ తో లాగించేస్తుంన్నాడట. ఈ క్రమంలో భారతీయుడు 2 పై నిర్మాత ఇచ్చిన అప్డేట్ గేమ్ ఛేంజర్ మేకర్స్ ని భయపెట్టేదిగా ఉంది.
మరో 20 రోజులు షూటింగ్ చేస్తే కానీ భారతీయుడు 2 చిత్రీకరణ పూర్తి కాదట. అలాగే సీజీ వర్క్ పెండింగ్ ఉందట. 2024 సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కాబట్టి దాదాపు మరో పది నెలలు శంకర్ భారతీయుడు 2 పనుల్లో బిజీగా ఉంటారు. గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పై పూర్తి స్థాయిలో ఆయన దృష్టిలో పెట్టే అవకాశం లేదు. ఇది నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్ లను భయపెట్టే అంశమే. అలాగే గేమ్ ఛేంజర్ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న తీరుగా భారతీయుడు 2 షూట్ గేమ్ ఛేంజర్ కి పిడుగుపాటుగా మారింది. దిల్ రాజు తన బ్యానర్లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ రూపొందిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
కాగా రామ్ చరణ్ ఇటీవల తండ్రి అయ్యాడు. ఆయన భార్య ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులు పేరెంట్స్ అయ్యారు. దీంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. రామ్ చరణ్, ఉపాసన 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు.