సీఎం జగన్‌తో రామ్ గోపాల్ వర్మ భేటీ.. 40 నిమిషాల పాటు సాగిన సమావేశం.. సినిమా కోసమేనా..?

By Sumanth KanukulaFirst Published Oct 26, 2022, 4:20 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. సీఎం జగన్, రామ్ గోపాల్ వర్మల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం సాగినట్టుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. సీఎం జగన్‌ను కలిశారు. సీఎం జగన్, రామ్ గోపాల్ వర్మల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం సాగింది. సీఎం జగన్‌తో కలిసి ఆర్జీవీ లంచ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. వీరి భేటీలో ఏం చర్చించారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక, ఈ భేటీకి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచారు. సీఎం జగన్‌ను వర్మ కలిసేవరకు కూడా ఈ సమాచారం బయటకు తెలియదనే చెప్పాలి. అయితే సీఎం జగన్‌కి అనుకూలంగా వర్మ ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. 

జగన్‌‌కు లబ్ది చేకూర్చేలా ఆయనకు సంబంధించిన కథలోనే వర్మ సినిమా తీయనున్నారనే ప్రచారం ఓవైపు సాగుతుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మీద లేక  1995 టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి చంద్రబాబు మీద వర్మ సినిమా తీసే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత భేటీ అని చెబుతున్నాయి. 

ఇక, 2019లో ఏపీలో ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపించి ఎన్నికల్లో దెబ్బతీయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్జీవీతో తీయించారని టీడీపీ ఆరోపించింది. ఈ చిత్రంపై ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే చివరకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్‌తో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలైంది. అయితే ఈ చిత్రం జగన్‌కు అనుకూలంగా మారిందనే టాక్ కూడా వినిపించింది. 

అయితే ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో మాత్రం జగన్ సర్కార్‌‌పై వర్మ విమర్శలు చేశారు. జగన్‌పై నేరుగా కామెంట్స్ చేయకపోయినప్పటికీ.. కొందరు మంత్రులను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు  గుప్పించారు. ఆ తర్వాత స్వయంగా మంత్రులను కలిసిన ఆర్జీవీ వారితోనే చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు ఆర్జీవీ ఉన్నట్టుండి సీఎం జగన్‌ను కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 

click me!