
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. జనవరిలో సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ రిలీజ్ టైంకి కోవిడ్ థర్డ్ వేవ్ ఎక్కువ కావడంతో వాయిదా వేయక తప్పలేదు.
ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. భీమ్లా నాయక్ ఇటీవల విడుదలై అదరగొడుతోంది. ఇదే జోష్ లో రాధే శ్యామ్ కూడా రాబోతోంది. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథా చిత్రంగా దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా నటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య. చేతి రాతలు చూసి ఎంతటి వారి భవిష్యత్తు అయినా ఇట్టే చెప్పేయగలడు.
ఈ చిత్రం కోసం చాలా అంశాలపై లోతుగా రీసెర్చ్ చేశాం అని రాధాకృష్ణ అన్నారు. హిందూ వివాహాలకు సంబంధించిన అద్భుతమైన అంశం ఈ చిత్రంలో ఉంది. వివాహాల్లో వధూవరులకు అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఇందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది అని రాధాకృష్ణ అన్నారు.
టెలిస్కోప్ ని 15వ శతాబ్దంలో రూపొందించారు. ఆ తర్వాత అరుంధతి, వశిష్ట నక్షత్రాలు ట్విన్ స్టార్ అని.. అవి రెండు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయని కనుగొన్నారు. కానీ మన పూర్వీకులకు ఆ విషయం వేల సంవత్సరాల నుంచి తెలుసు. టెలిస్కోప్ కనుకొనక ముందు వేల ఏళ్ల నుంచే హిందువులు పెళ్లిళ్లలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు.
వధూవరులు ఇద్దరూ అరుంధతి, వశిష్ట నక్షత్రాల మాదిరిగా ఒకరి చుట్టూ ఒకరు తిరిగే తరహాలో కలిగి ఉండాలనేది దాని అర్థం. విశ్వంలో చాలా ట్విన్ స్టార్స్ ఉంటాయి. కానీ వాటిలో ఒక స్టార్ సెంటర్ లో ఉంటే మరొక స్టార్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ అరుంధతి, వశిష్ట నక్షత్రాలు మాత్రం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఇది చాలా అద్భుతమైన విషయం. మన పూర్వీకులు ఈ విషయాన్నీ ఎలా కనుగొన్నారు అంటూ రాధాకృష్ణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అంశం రాధే శ్యామ్ చిత్రంలో ఉందని రాధా కృష్ణ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.