
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద జనాల తాకిడి ఎక్కువగా ఉంది. సామాన్యుల నుండి సినీ ప్రముఖుల వరకూ ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఆయన క్యూలో నిలబడి ఓటు వేయలేదని ప్రముఖ ఛానెల్ కి చెందిన ఓ రిపోర్టర్ సంచలనం సృష్టించే ప్రయత్నం చేశారు. పవన్ క్యూలో ఉన్న జనాలను ఇబ్బందికి గురి చేస్తూ.. నేరుగా వెళ్లి ఓటేశారని అక్కడ ఉన్న ఓటర్లతో పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు.
దీంతో సదరు ఛానెల్ కి, రిపోర్టర్ కి దర్శకుడు మారుతి కౌంటర్ ఇచ్చాడు. దయచేసి ఇలాంటి విషయాలను సంచలనం చేయకండని సూచించారు. పవన్ లాంటి వ్యక్తి క్యూలో నిలబడే పరిస్థితి ఉంటుందా..? అని మారుతి ప్రశ్నించాడు. అలా చేస్తే మరిన్ని సెక్యురిటీ సమస్యలు వస్తాయని అన్నారు.
పవన్ క్యూలో నిలబడి ఓటేస్తే అక్కడ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుందని కాబట్టే ఆయన ఓటు వేసి వెళ్లిపోయారని మారుతి చెప్పారు. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రం వద్ద ఓ యువకుడు చెబుతుంటే సదరు మీడియా ప్రతినిధి అతడి వాయిస్ ని మధ్యలో కట్ చేసింది. అలా ఎందుకు చేశారని కూడా మారుతి ప్రశ్నించారు.