నైట్రో స్టార్ సుధీర్‌బాబు (Sudeer Babu) తాజాగా నటిస్తున్న చిత్రం ‘హంట్’. ఇటీవల ట్రైలర్ విడుదలై అంచనాలు పెంచేసింది. తాజాగా దర్శకుడు మహేశ్ సినిమా గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో, నైట్రో స్టార్ సుధీర్‌బాబు ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరిగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రతి సినిమాకు ఆయన ఎంతో శ్రమిస్తున్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ రావడం లేదు. ఈ క్రమంలో ఓ బిగ్ బ్రేక్ కోసం వేచి చూస్తున్నారు. సుధీర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘హంట్’ (Hunt) ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర యూనిట్ కూడా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.
రీసెంట్ గా వచ్చిన Hunt Trailerలోని స్టంట్స్, యాక్షన్ సీక్వెల్స్, సుధీర్ బాబు ఫైట్స్ సినిమాపై హైప్ ను పెంచేలా కనిపిస్తున్నాయి. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మహేశ్ తాజా ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... మొదట లవ్ స్టోరీ, స్పె థ్రిల్లర్ అనుకున్నాం. కానీ చివరికి ‘హంట్’ ఐడియా సెట్ అయ్యింది. భవ్య క్రియేషన్స్ పూర్తి సహకారంతో సినిమాను నిర్మించారు. ‘హంట్’ కథకు సుధీర్ బాబు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.
‘హంట్’ టీజర్, ట్రైలర్ చూశాక... స్టంట్స్, ఫైట్స్ గురించి చెబుతున్నారు. మా సినిమాలో అవి మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ (ఫైట్స్) వల్ల సినిమాలు ఆడతాయని నేను నమ్మను. ఎమోషనల్ కంటెంట్ వల్ల సినిమాలు నిలబడతాయి. 'హంట్'లో సుధీర్ బాబు, శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ క్యారెక్టర్ల మధ్య స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకులు ఉద్వేగానికి గురి అవుతారు. ఫైట్స్ కంటే అక్కడ ఎమోషన్ ప్రేక్షకులను హంట్ చేస్తుంది. క్లైమాక్స్ చూశాక మంచి ఫీలింగ్ తో, బరువెక్కిన గుండెతో బయటకు వెళతారు. సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ బాగా చేశారు. ఇది సుధీర్ బాబు కెరీర్ డిఫైన్ చేసే సినిమా అవుతుంది. అతను ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమా అవుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఓ యాక్సిడెంట్ లో గతం మర్చిపోయిన పోలీస్ ఆఫీసర్... తనను తాను తెలుసుకుంటూ, జీవితంలో జరిగిన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ తాలూకూ మిస్టరీని ఎలా చేధించాడనేదే ఈ సినిమా. అన్నీ గుర్తుండి సాల్వ్ చేయడం ఒక పద్ధతి. ఏమీ తెలియనివాడు ఎలా సాల్వ్ చేశాడనేది మిస్టరీగా ఉండనుందని తెలిపారు. హీరోయిన్ లేని ఈ చిత్రంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. ఇందులో శ్రీకాంత్, తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది.