సరికొత్త కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో కార్తి నటించిన తాజా చిత్రం 'దేవ్'. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
నటీనటులు: కార్తి, రకుల్ ప్రీత్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు
సంగీతం: హారిస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: వేల్ రాజ్
ఎడిటింగ్: ఆంటోనీ ఎల్ రూబెన్
నిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రజత్ రవిశంకర్
సరికొత్త కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో కార్తి నటించిన తాజా చిత్రం 'దేవ్'. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో.. సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
undefined
కథ:
దేవ్(కార్తి) తనకు నచ్చినట్లు జీవిస్తుంటాడు. అతడికి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అతడి ఇద్దరి స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. తన స్నేహితుడి కారణంగా ఫేస్ బుక్ ద్వారా మేఘన(రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. దేవ్ ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఇద్దరి మనస్తత్వాలు, ఆలోచనలు వేరు. మేఘన ఓ వ్యాపారవేత్త. ప్రేమ, స్నేహం వంటి విషయాలను పెద్దగా పట్టించుకోదు.
చిన్నప్పుడే తండ్రి వదిలి వెళ్లిపోవడంతో తన తల్లితో కలిసి జీవిస్తుంటుంది మేఘన. ఎన్నో కష్టాలు పడ్డ ఆమె తన హార్డ్ వర్క్ తో బిజినెస్ ఉమెన్ గా ఎదుగుతుంది. అటువంటి ఆమెని దేవ్ ప్రేమిస్తాడు. మొదట దేవ్ ని పట్టించుకోని మేఘన మెల్లగా అతడి ప్రేమలో పడుతుంది. కానీ ఓ కారణంగా దేవ్.. మేఘనతో మాట్లాడలేకపోతాడు. దాంతో దేవ్ తనను పట్టించుకోవడం లేదని అతడి నుండి దూరంగా వెళ్లిపోతుంది. ఆ తరువాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
అమ్మాయి, అబ్బాయిల మధ్య సంఘర్షణతో కూడుకున్న ప్రేమకథను చూపించాలా..? లేక అడ్వెంచరస్ కథగా తెరకెక్కించాలా..? అనే విషయంలో క్లారిటీ లేక తనకు నచ్చినట్లుగా సినిమాను తీసుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు. దీంతో సినిమా చూస్తున్న ఆడియన్స్ కథకు కనెక్ట్ కాలేకపోతారు. హీరో, హీరోయిన్ల పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికే సగం సమయం తీసుకున్న దర్శకుడు వారి మధ్య ప్రేమ పుట్టించడం, ఒకట్రెండు అడ్వెంచరస్ సన్నివేశాలతో సినిమాను పూర్తి చేసేశాడు.
కథలో కొత్తదనం లేనప్పుడు కథనంపై దృష్టి పెట్టి చిన్న చిన్న ట్విస్ట్ లతో సినిమాను ఆసక్తికరంగా మలచవచ్చు కానీ డైరెక్టర్ అదీ చేయలేదు. పోనీ కామెడీ ఏమైనా పెట్టి కాసేపైనా నవ్వించాడా..? అంటే అది కూడా కరువైంది. హీరో పాత్రని బలంగా రాసుకోలేకపోయాడు. హీరోయిన్ కి ఉండే కన్ఫ్యూజన్ మైండ్ ని తెరపై సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. హీరోని ఓ వీడియోలో చూసి ప్రేమించేస్తుంది హీరోయిన్. ఇక అతడి నుండి విడిపోవడానికి కూడా బలమైన కారణం ఉండదు.
ఇద్దరి మధ్య ప్రేమకథను పేలవంగా రాసుకున్నాడు. అసలే కథ ముందుకు కదలడం లేదని భావించే ఆడియన్స్ కి మధ్యలో పాటలు వచ్చి మరింత చికాకు కలిగిస్తుంటాయి. పతాక సన్నివేశాల్లో ఏకంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం, అక్కడ గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడం విసుగు పుట్టిస్తుంది. హీరో కార్తి దర్శకుడిని నమ్మి ఆయన చెప్పినట్లుగా బరువు తగ్గి తన నటనతో దేవ్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. సరికొత్త లుక్ తో కనిపించాడు. తనకు నచ్చినట్లుగా ఉంటూ ఎంజాయ్ చేసే యువకుడిగా.. ప్రేమించిన అమ్మాయి కోసం పరితపించే వ్యక్తిగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.
రకుల్ సీరియస్ క్యారెక్టర్ లో బాగానే నటించినప్పటికీ తెరపై ఈ జంట కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి సీనియర్ నటులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పాలి. వారి డబ్బింగ్ కూడా సరిగ్గా కుదరలేదు. దర్శకుడు ఇలాంటి కథతో కార్తిని ఎలా ఒప్పించాడో అర్ధం కాని పరిస్థితి. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. అందమైన లొకేషన్స్ కనిపిస్తాయి. హారిస్ జయరాజ్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. చాలా వరకు కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ప్రేమికులరోజు కానుక వచ్చిన ఈ లవ్ స్టోరీ యూత్ కి మాత్రమే కాదు.. ఎవరినీ పెద్దగా ఆకట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు.
రేటింగ్: 2/5