
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వ్యతిరేకంగా సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసు విచారణకు బోత్రా మరణం తర్వాత ఆయన కుమారుడు గగన్ బోత్రా సక్రమంగా హాజరుకాలేదు. కేసు కొనసాగించే ఉద్దేశం గగన్ బోత్రాకు లేదన్నట్టుగా పరిగణిస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
వివరాల్లోకి వెళితే... గతంలో బోత్రా నుంచి దర్శక నిర్మాత, రజనీకాంత్ వియ్యంకుడైన కస్తూరిరాజా రూ.65 లక్షలు రుణంగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తాను చెల్లించకుంటే రజనీకాంత్ చెల్లిస్తారని అగ్రిమెంట్ పత్రాల్లో సంతకాలు చేసినట్టు సమాచారం. అయితే, రుణం చెల్లించేందుకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో బోత్రా కోర్టును ఆశ్రయించారు. సూపర్‌స్టార్ పేరును దుర్వినియోగం చేసినందుకు కస్తూరిరాజాపై చర్యలు తీసుకునేలా రజనీకాంత్‌ను ఆదేశించాలని కోరారు.
ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి... బోత్రా పిటిషన్‌ను తోసిపుచ్చి రూ.25 వేల అపరాధం కూడా విధించారు. ఈ తీర్పును అప్పీల్ చేయగా, ఈ కేసు విచారణ పూర్తికాకముందే బోత్రా మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన కుమారుడు గగన్ బోత్రా కేసు విచారణకు హాజరయ్యారు. అయితే, గత రెండు వాయిదాలకు ఆయన హాజరుకాలేదు. దీంతో ఆయనకు కేసును కొనసాగించే ఉద్దేశ్యం లేనట్టుగా ఉందని పేర్కొంటూ బోత్రా వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది
గతేడాది దీపావళికి విడుదలైన పెద్దన్న తెలుగులో డిజాస్టర్ అయ్యింది. తమిళంలో కూడా కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో సాధించలేదు. శివ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్‌లో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే పెద్దన్న తర్వాత ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు రజనీకాంత్. విజయ్ హీరోగా ప్రస్తుతం బీస్ట్ సినిమా చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీ తర్వాత సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.