
జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ గా మారాడు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది. తెలంగాణ గ్రామీణ భావోద్వేగాలు ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణు.. బలగం చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బలగం చిత్రం అంతర్జాతీయంగా అనేక అవార్డులు సొంతం చేసుకుంటోంది.
ఇప్పుడు జబర్దస్త్ బ్యాగ్రౌండ్ నుంచి మరో కమెడియన్ దర్శకుడిగా మారాడు. అతనెవరో కాదు బక్కపలచని ధనరాజ్. ధనరాజ్ దర్శకుడి కాబోతున్నట్లు ఇదివరకే తెలిపాం. ఆ వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయి. ధనరాజ్ దర్శకత్వంలోని చిత్రం నేడు ప్రారంభం అయింది.
దాదాపు జబర్దస్త్ నుంచి ధనరాజ్ స్నేహితులు అంతా ఈ ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. వారిలో బలగం డైరెక్టర్ వేణు కూడా ఉన్నారు. సుడిగాలి సుధీర్ చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, కమెడియన్ పృథ్వీ లాంటి వాళ్లంతా హాజరయ్యారు.
ఫస్ట్ షాట్ ని బలగం వేణు డైరెక్టర్ చేశారు. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది ఎవరో కాదు.. ఆల్రెడీ చెప్పినట్లుగానే సముద్రఖని నటిస్తున్నారు. తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామా ఈ చిత్రం అని ధనరాజ్ పేర్కొన్నాడు. ఎవరూ టచ్ చేయని ఎమోషన్ ని తాను చెప్పబోతున్నట్లు ధనరాజ్ పేర్కొన్నాడు.
అలాగే పూర్తిగా ఎమోషనల్ గా కాకుండా వినోదభరితంగా కూడా ఉంటుందని ధనరాజ్ తెలిపారు. ఈ చిత్రంలో సముద్రఖని తండ్రిగా నటిస్తుండగా.. కొడుకుగా ధనరాజ్ నటిస్తుండడం విశేషం, అజయ్ ఘోష్, కమెడియన్ పృథ్వీ, లావణ్య రెడ్డి లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.