సినారే అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం కేసీఆర్

First Published Jun 13, 2017, 6:51 PM IST
Highlights
  • సినారే అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
  • సినారే నివాసంలో మృతదేహానికి నివాళులర్పించిన కేసీఆర్
  • ప్రశాసనన్ నగర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమ యాత్ర

ప్రముఖ సాహితీవేత్త సి. నారాయణ రెడ్డిని స్మరించుకొనేందుకు వీలుగా ఆయన పేరున మ్యూజియాన్ని ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. నారాయణరెడ్డి భౌతిక కాయం వద్ద కెసిఆర్ మంగళవారం నాడు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలుగు ప్రజలంతా గర్వంగా చెప్పుకొనే కవి నారాయణరెడ్డి అని ఆయన కొనియాడారు. తెలంగాణ సాహితీ మకుటంలో కలికితురాయిగా ఆయన అభివర్ణించారు.

 

ఆది, అంత్యప్రాసలకు ఆయనకు ఆయనే సాటి అని కెసిఆర్ చెప్పారు. నారాయణరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చే వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను ఏర్పాటుచేసినట్టు కెసిఆర్ చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో బస్సులను ఏర్పాటుచేస్తామన్నారు. ఉచితంగానే ఈ బస్సుల్లో ప్రయాణించి అంత్యక్రియల్లో పాల్గోనాల్సిందిగా కెసిఆర్ చెప్పారు. ఇందుకోసం వంద బస్సులను ఏర్పాటుచేసినట్టు ఆయన చెప్పారు. సినారె పేరున మ్యూజియాన్ని, స్మారక భవనాన్ని ఏర్పాటుచేస్తామని కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రముఖ సంస్థ లేదా యూనివర్శిటీకీ సినారె పేరును పెడతామన్నారు. పూర్వ కరీంనగర్ జిల్లాలో సినారె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.

ఇక సినారే అంత్య క్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక బుధవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ సారస్వత భవనం లో సినారే పార్థివ దేహాన్ని ప్రజలు, ఆయన అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అక్కడి నుంచి ప్రశాసన్ నగర్ మహా ప్రస్థానం వరకు జరిగే అంతిమ యాత్రలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని దహన సంస్కార కార్యక్రమాలు పూర్తయ్యే వరకు సీఎం హాజరు కానున్నారని ఈ సందర్భంగా ప్రముఖ కవి గాయకుడు, సీఎంఓ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ తెలిపారు.

click me!