
దాదాపు ఏడాది పాటుగా టాలీవుడ్(Tollywood) చిత్ర పరిశ్రమ పడుతున్న ఇబ్బంది నుంచి బిగ్ రిలీఫ్ దొరికింది. టికెట్‌రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కొత్త జీవో(AP Government GO) తీసుకొచ్చి నిర్మాతలకు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకి గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడమేకాదు, జీవోని సోమవారం సాయంత్రం విడుదల చేసింది. థియేటర్లని ప్రధానంగా నాలుగు విభాగాలుగా విభజించి ఒక్కో థియేటర్లో సీట్లని రెండు రకాలుగా విడగొట్టి టికెట్‌రేట్లని ఖరారు చేసింది. పెంచిన టికెట్ రేట్లు నిర్మాతలు, ఎగ్జిబిటర్లకి ప్రయోజనకరంగానే ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే దీనిపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్పందించారు. ఏపీ సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలిపారు. `తెలుగు సినిమా పరిశ్రమకి మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్లు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌జగన్‌గారికి పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు. చిన్న సినిమాకి ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు పేర్నినానికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు` అని పేర్కొన్నారు.
ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంతో పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు విమర్శిస్తూ కామెంట్లు చేశారు. దీంతో వివాదం మరింతగా ముదిరింది. ఆ తర్వాత ఓ సారి చిరంజీవి స్వయంగా వెళ్లి సీఎం జగన్‌ని కలిశాడు. నాగార్జున కూడా కలిశారు. కానీ దీనిపై ఎలాంటి స్పందన లేదు. దీంతో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. ఆయన వరుస ట్వీట్లతో ఏపీ ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానికి చుక్కలు చూపించారు. అంతేకాదు ఏకంగా మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. కానీ సమస్య కొలిక్కి రాలేదు.
దీంతో సీఎం జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవి రంగంలోకి దిగారు. ఆయన పలు వేదికల్లో సీఎంని రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన సీఎంని కలిసి సమస్యలను వివరించారు. త్వరలోనే మంచి నిర్ణయాలు వస్తాయని, అందరికి సానుకూల నిర్ణయం వస్తుందని తెలిపారు. ప్రభాస్, మహేష్,రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, అలీ, పోసానిలతో కలిసి చిరంజీవి సీఎం జగన్‌ని కలిసి సమస్యని వివరించారు. జగన్ త్వరలోనే సమస్యని పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. దాదాపు 25రోజుల గ్యాప్‌తో జీవోని విడుదల చేసిన విషయం తెలిసిందే.