
మెగాస్టార్ చిరంజీవికి `భోళాశంకర్` పెద్ద షాక్ ఇచ్చింది. ముందుగా ఊహించినట్టే ఈ చిత్రం దారుణమైన పరాజయం చెందింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిర్మాత అనిల్ సుంకరకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. దాదాపు యాభై కోట్లకుపైగా నష్టాలుంటాయని టాక్. ఈ సినిమా రీమేక్ లనే ప్రశ్నార్థకంగా మార్చింది. అంతేకాదు రీమేక్‌లకు ఓ గుణపాఠంలా నిలిచింది. రీమేక్ చేయాలనుకునే వారికి దాని రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో చూపించింది.
ఈ నేపథ్యంలో చిరంజీవి రీమేక్‌లకు ఇక గుడ్ బై చెప్పినట్టే అంటున్నారు. ఆయన ఇప్పుడు రీమేక్‌లకు దూరంగా ఉంటున్నారట. అంతేకాదు లేటెస్ట్ సమాచారం మేరకు ఓ నిర్మాత మరో రీమేక్‌తో చిరంజీవిని కలిశారట. ఆ విషయం తెలిసి చిరంజీవి వెంటనే నో చెప్పాడట. నిర్మొహమాటంగా తాను చేయబోనని వెల్లడించారట. ఇకపై తాను రీమేక్‌లకు జోలికి పోకూడదని నిర్ణయించుకున్నారట. అయితే ఈ సందర్బంగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
చిరంజీవి.. నెక్ట్స్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నారనే వార్త లేటెస్ట్ గా వినిపిస్తుంది. ఓ మంచి ఎంటర్‌టైనింగ్ స్క్రిప్ట్ తో చిరంజీవిని కలిశారట అనిల్ రావిపూడి. చిరంజీవికి వినిపించగా ఆయన ఇంప్రెస్ అయ్యారట. అది సినిమా సెట్ అయ్యే దిశగా ప్లాన్ జరుగుతుందని సమాచారం. చిరంజీవి తన 158వ చిత్రంగా ఇదిరాబోతుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి ఎంటర్‌టైనింగ్ కోటింగ్‌కి, చిరంజీవి కామెడీ టైమింగ్ సెట్ అయితే సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుందని చెప్పొచ్చు.
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలను ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ లో వశిష్ట దర్శకత్వంలో తన 157వ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. సోషియో ఫాంటసీగా ఈచిత్రం ఉంటుందని సమాచారం. దీంతోపాటు తన కూతురు సుస్మిత ప్రొడక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు. ఇది తన 156వ మూవీగా రాబోతుంది. దీనికి డైరెక్టర్‌ని ప్రకటించలేదు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసే అవకాశం ఉందట.