
మెగాస్టార్ చిరంజీవి చేతిలో గతేడాది నాలుగు సినిమాలున్నాయి. ఆయన ఏకకాలంలో నాలుగు సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఓ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరో మూడు నెలల్లో అది రిలీజ్ కాబోతుంది. కానీ ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటన లేదు. చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి, కానీ ఏదీ క్లారిటీ లేదు. చిరంజీవి నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది పెద్ద సస్పెన్స్. పేరున్న చాలా మంది దర్శకులు, కొత్త డైరెక్టర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అవి గాసిప్ లుగానే మిగిలిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చిరంజీవి తన తదుపరి సినిమాలను కన్ఫమ్ చేశారని తెలుస్తుంది. ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు చిరు సిద్ధమయ్యారట. అందులో ఒకరు `సోగ్గాడే చిన్ని నాయన`, `బంగార్రాజు` వంటి ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ చిత్రాలను అందించిన కళ్యాణ్ కృష్ణ అయితే, `బింబిసార`తో మంచి విజయాన్ని అందించిన వశిష్ట ఉండటం విశేషం. ఈ ఇద్దరితో చిరంజీవి తన నెక్ట్స్ సినిమాలు చేయబోతున్నారట.
యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఓ మంచి ఫ్యామిలీ, కమర్షియల్ స్టోరీని చిరంజీవికి చెప్పగా ఆయన ఓకే చెప్పారని సమాచారం. అయితే ఇది `బంగార్రాజు` స్టయిల్‌లో ఉంటుందని సమాచారం. ఇందులో యంగ్ పెయిర్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. అందుకు సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీలను అనుకుంటున్నారు. `బంగార్రాజు`లోనూ నాగార్జునతోపాటు నాగచైతన్య, కృతి శెట్టి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇది గత సంక్రాంతికి వచ్చి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి సిద్దు, శ్రీలీల ఇంకా ఫైనల్ కాలేదట. ఈ సినిమాని చిరు డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించబోతున్నారు.
మరోవైపు `బింబిసార` ఫేమ్ వశిష్ట సైతం ఇటీవల చిరంజీవికి ఓ ఫాంటసీ స్టోరీని నెరేట్ చేయగా, చిరుకి నచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్ట్ కి కూడా మెగాస్టార్ ఓకే చెప్పారని, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించబోతుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే చిరంజీవిపై ఫాంటసీ స్టోరీ అంటే కచ్చితంగా అది వేరే లెవల్లో ఉంటుందని అనుకోవచ్చు. దీంతో ఫ్యాన్స్ లో సంబరాలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందట. ఈ రెండింటిలో మొదట ఏ సినిమా స్టార్ట్ అవుతుందనేది సస్పెన్స్.
ప్రస్తుతం చిరంజీవి.. మెహర్ రమేష్ తో `భోళా శంకర్` సినిమా చేస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ ఆయనకు చెల్లిగా నటిస్తుంది. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇందులో చిరు చాలా రోజుల తర్వాత టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తాడని తెలుస్తుంది.