హీరో సిద్ధార్థ్ నటించిన ఓయ్ పెద్దగా ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది. ప్రేమికుల రోజు పురస్కరించుకుని రీరీలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దక్కించుకుంది.
ఒక దశలో హీరో సిద్ధార్థ్ తెలుగులో వరుస చిత్రాలు చేశాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో సత్తా చాటాడు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా... సిద్దార్థ్ ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు చిత్రం. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ కొట్టింది. తర్వాత బొమ్మరిల్లు మూవీతో అంతకు మించిన హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు సిద్ధార్థ్ ఇమేజ్ ఎక్కడికో తీసుకెళ్లాయి.
ఆయనకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఓయ్ టైటిల్ తో రొమాంటిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ చేశాడు. ఈ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ షామిలి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. యువన్ శంకర్ రాజా సాంగ్ ఆకట్టుకోగా సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఓయ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రాణాంతక వ్యాధితో బాధపడే అమ్మాయిగా షాలిని నటించింది.
సినిమా బాగానే ఉంటుంది. అయితే ట్రాజిక్ ఎండింగ్స్ ఎందుకో తెలుగు ఆడియన్స్ అంగీకరించరు. హీరోయిన్ చనిపోవడం వల్లనేమో కానీ ఓయ్ ని జనాలు రిజెక్ట్ చేశారు. మ్యూజికల్ హిట్ గా మాత్రం నిలిచింది. దాదాపు 14 ఏళ్ల అనంతరం ఓయ్ చిత్రాన్ని రీరీలీజ్ చేశారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఓయ్ థియేటర్స్ లోకి వచ్చింది.
అనూహ్యంగా భారీ స్పందన దక్కింది. ఓయ్ మూవీ చూసేందుకు లవర్స్ తో పాటు యూత్ ఎగబడ్డారు. పెద్దగా ప్రమోట్ చేసింది కూడా ఏమీ లేదు. ఓయ్ రీ రిలీజ్ గ్రాండ్ సక్సెస్ అనడంలో సందేహం లేదు. ఆరంజ్, ఈ నగరానికి ఏమైంది? వంటి చిత్రాలు ఫస్ట్ రిలీజ్ కి నిరాశపరిచాయి. రీరిలీజ్ లో సత్తా చాటాయి. ఈ లిస్ట్ లో ఓయ్ కూడా చేరింది. ఓయ్ చిత్రానికి ఆనంద్ రంగ దర్శకుడు.