బిగ్‌బాస్ చూపిస్తూ మెదడు ఆపరేషన్‌.. వాట్‌ ఎన్‌ ఐడియా గురూ!

By Aithagoni RajuFirst Published Nov 21, 2020, 9:31 AM IST
Highlights

బిగ్‌బాస్‌ చూపిస్తూ ఓ వ్యక్తికి మెదడు ఆపరేషన్‌ చేయడం విశేషం. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన వరప్రసాద్‌కి మెదడులో కణితి(బ్రెయిన్‌ ట్యూమర్‌) ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. 

బిగ్‌బాస్‌ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇదంతా ఓ ఎత్తైతే, బిగ్‌బాస్‌ ఓ మనిషి దృష్టిని పక్కకు మరల్చ కుండా ఉంచుతుందని నిరూపితమైంది. అంతేకాదు ఓ మనిషికి బిగ్‌బాస్‌ అంటే ఎంత పిచ్చో కూడా నిరూపించింది.

 తాజాగా బిగ్‌బాస్‌ చూపిస్తూ ఓ వ్యక్తికి మెదడు ఆపరేషన్‌ చేయడం విశేషం. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన వరప్రసాద్‌కి మెదడులో కణితి(బ్రెయిన్‌ ట్యూమర్‌) ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు 2016లో హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చేసి ఆ కణితిని తొలగించారు. అనంతరం పలు దఫాలుగా రేడియేషన్‌ ఇచ్చారు. అయినా గత కొన్ని నెలలు నుంచి ఆయనకు మళ్ళీ ఫిట్స్ వస్తున్నట్టు గుర్తించారు. 

గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా మెదడులో కణితి పెరిగినట్టు గుర్తించారు. దీంతో ఈ నెల 10న మెదడు త్రీడీ మ్యాప్‌ని తయారు చేసుకున్నారు. నావిగేషన్‌ పరిజ్ఞానంతో కచ్చితంగా కణితి ఎక్కడ ఉందో గుర్తించి అక్కడ మాత్రమే తెరచి తొలగించారు. మాటలు, సంభాషణకు కీలకమైన ప్రాంతంలో సర్జరీ చేస్తున్నందున రోగి స్పృహలో ఉండగానే, మాట్లాడుతుండగానే మెదడులో సంభవించిన పరిణామాలను పరిశీలిస్తూ దిగ్విజయంగా సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు. అందుకు బిగ్‌బాస్‌ షోని, `అవతార్‌` సినిమాని చూపించినట్టు వైద్యలు తెలిపారు. 

రోగికి పైసా ఖర్చు లేకుండా బీమా సౌకర్యంతో ఈ ఆపరేషన్‌ని నిర్వహించామని, రోగి పూర్తిగా కోలుకున్న కారణంగా శుక్రవారం రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడని వైద్యులు వివరించారు. వైద్యులు భవనం హనుమా శ్రీనివాస్‌రెడ్డి, శేషాద్రి శేఖర్‌, త్రినాథ్‌ లు గుంటూరు సర్వజనాసుపత్రి వైద్యులు కావడం విశేషం. 

click me!