
బిగ్ బాస్ నాన్ స్టాప్ (Biggboss Nonstop)లో మొదటి ఎలిమినేషన్ జరిగింది. నటి ముమైత్ ఖాన్ హౌస్ ని వీడారు. ఎలిమినేషన్ ప్రకటన ముమైత్ ని భారీ కుదుపుకు గురిచేసింది. బిగ్ బాస్ సీజన్ 1లో ఎనిమిది వారాలు ఉన్న ముమైత్ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మాత్రం మొదటి వారానికే ఎలిమినేట్ అయ్యారు. ఇదే విషయాన్ని ఆమె గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. అలాగే తోటి కంటెస్టెంట్స్ తనపై ప్రేక్షకులకు తప్పుడు అభిప్రాయం వచ్చేలా చేశారని, అందుకే ఎలిమినేట్ అయ్యాయని ఆవేదన చెందారు. వేదికపై నాగార్జునకు ఇదే విషయం చెప్పుకొని ముమైత్ నాన్ స్టాప్ గా ఏడ్చేసింది.
హౌస్ నుండి వెళ్ళిపోతున్న భాధ ముమైత్ (Mumaith Khan)కళ్లలో స్పష్టంగా కనిపించింది. దానికి ఒక బలమైన కారణం ఉంది. ముమైత్ కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు వంద చిత్రాల్లో ఐటెం సాంగ్స్, క్యామియో రోల్స్ చేశారు ముమైత్. పోకిరి, యోగి వంటి చిత్రాలలో ముమైత్ చేసిన ఐటెం సాంగ్స్ ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. ఆ సమయంలో ఆమె కెరీర్ పీక్స్ కి చేరింది. మైసమ్మ ఐపీఎస్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం కూడా చేశారు.
ఐటెం భామలకు కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఆమె ఓ దశాబ్దం క్రితమే ఫేడ్ అవుట్ అయ్యారు. దీంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా ఆఫర్స్ తగ్గిపోయాక ముమైత్ ప్రైవేట్ ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టారు. లక్షకు రెండు లక్షలకు గ్రామాల్లో పండుగలకు, పబ్బాలకు జరిగే ఉత్సవాల్లో కూడా ఆమె డాన్సులు చేశారు. కరోనా రాకతో ఆ ఆదాయానికి కూడా గండిపడింది. చేతిలో సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ముమైత్ ఖాన్ కి బిగ్ బాస్ నాన్ స్టాప్ రూపంలో మంచి అవకాశం దక్కింది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కనీసం కొన్నివారాలు ఉండగలితే ఎంతో కొంత డబ్బులు సమకూరుతాయని ఆశించిన ముమైత్ కి నిరాశే ఎదురైంది. ఆమె జర్నీ చాలా త్వరగా ముగిసింది. ముమైత్ వేదికపై అంతలా కన్నీరు పెట్టుకోవడానికి కారణం ఆర్ధిక ఇబ్బందులే అని చెప్పకనే చెబుతున్నాయి. మిగతా కంటెస్టెంట్స్ సంగతేమో కానీ, ముమైత్ కి ఇంట్లో ఉండడం చాలా అవసరం. ఏది ఏమైనా గేమ్ ఈజ్ గేమ్ ప్రేక్షకులు కావలసింది ఎంటర్టైన్మెంట్. వాళ్లకు ముమైత్ ఖాన్ పెర్ఫార్మన్స్ నచ్చలేదు. బయటికి పంపివేశారు.