బాలయ్య - అనిల్ రావిపూడి సినిమా ‘భగవంత్ కేసరి’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మరికొద్దిరోజుల్లో విడుదల ఉండటంతో అప్డేట్స్ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది.
నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో హిట్లు అందుకుంటున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఎంతటి సక్సెస్ ను అందుకున్నాయో తెలిసిందే. ఇక ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంతో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసిన సంగతి విధితమే. ఆ మధ్యలో వచ్చిన టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది.
రెండు నెలల్లో ఈ మూవీ విడుదల కానుంది. దీంతో యూనిట్ సినిమా పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే కీలక సన్నివేశాలను చిత్రీకరించగా.. ప్రస్తుతం సాంగ్స్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుగుతుందని సమాచారం. ఇందుకోసం మేకర్స్ భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేశారు. అందులోనే ప్రస్తుతం షూట్ కొనసాగుతోంది.
ఈ సాంగ్ షూట్ లో సినిమాలోని ప్రధాన తారగణం నటిస్తోందంట. సినిమాకు ఈ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం యూనిట్ సాంగ్ షూట్ ను గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారంట. మొత్తానికి పాటలకు సంబంధించిన షూట్ పూర్తయ్యాక సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ అందించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అందించిన అప్డేట్స్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేసింది.
బాలయ్య తెలంగాణ యాస, భాషలో డైలాగ్ లు అదరగొడుతున్నారు. మాస్ అవతారంలో నెక్ట్స్ లెవల్ పెర్ఫామెన్స్ ఉండబోతోందని టీజర్ ద్వారా అర్థం అవుతోంది. కామెడీ పరమైన సినిమాలతో అలరించిన అనిల్ రావిపూడి మొదటిసారిగా యాక్షన్ తో ఆకట్టుకోబోతున్నారు. దీంతో సినిమాపై ఆసక్తిపెరుగుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. శ్రీలీలా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా ఓ పాత్రలో మెరియనుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.