
ప్రభాస్ కెరీర్లో మొదటిసారి పౌరాణిక చిత్రం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రామునిగా కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్ భారీ బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కించారు. ఇటీవల ఆదిపురుష్ టీజర్ విడుదల చేయగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్స్ విమర్శలపాలయ్యాయి. ముఖ్యంగా టీజర్లో విఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉంది. కార్టూన్ మూవీని తలపించిందంటూ విమర్శలు వినిపించాయి.
ఈ విమర్శలకు దర్శకుడు ఓం రౌత్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆదిపురుష్ 3డి ఫార్మాట్ లో బిగ్ స్క్రీన్ ని ఉద్దేశించి తీసిన సినిమా... సిల్వర్ స్రీన్ పై నిజమైన అనుభూతి కలుగుతుంది. ఆదిపురుష్ నిరాశపరచదని బల్లగుద్ది చెబుతాను అన్నాడు. అనంతరం థియేటర్స్ లో టీజర్ విడుదల చేశారు. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే ఆదిపురుష్ విడుదల దాదాపు వాయిదా పడినట్లే అని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆదిపురుష్ సమ్మర్ కి షిఫ్ట్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇదే నిజమైతే అభిమానులకు నిరాశ తప్పదు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ విడుదల చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. సమ్మర్ కి పోస్ట్ పోన్ చేస్తే ఫ్యాన్స్ సంక్రాంతి మజా మిస్ అవుతారు. ఆదిపురుష్ వాయిదా పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.
ఆదిపురుష్ మూవీలో సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా విలన్ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ నుండి మరో చిత్రం సలార్ రానుంది. చిత్రీకరణ జరుపుకుంటున్న సలార్ పై భారీ అంచనాలున్నాయి. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.