అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ... పెళ్లైన గర్భవతిని పెళ్లిచేసుకోవడం..ఇదోరకం ప్రేమ

Published : Aug 25, 2017, 09:35 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ... పెళ్లైన గర్భవతిని పెళ్లిచేసుకోవడం..ఇదోరకం ప్రేమ

సారాంశం

నటీనటులు: విజయ్ దేవరకొండ, షాలిని, రాహుల్ రామకృష్ణ, కాంచన, సంజయ్ స్వరూప్ తదితరులు సంగీతం: రాధన్ సినిమాటోగ్రఫీ: రాజు తోట ఎడిటింగ్: శశాంక్ నిర్మాతలు: ప్రణయ్ రెడ్డి వంగ దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ ఆసియానెట్ రేటింగ్: 2.5/5

పెళ్లి చూపులు సక్సెస్ తో.. ఊపు మీదున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాలోని ముద్దు సీన్లు, బూతుల పంచాంగం  మూలంగా గత కొన్ని రోజులుగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రి రిలీజ్ ఫంక్షన్ లో.. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు సినిమాపై అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాయి. మరి సినిమా హైప్ క్రియేట్ చేసినట్టే.. జనాలకు రీచ్ అయిందా... చూద్దాం.

కథ:

అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ)మంగళూరులో సంట్ మేరీస్ మెడికల్ కాలేజీ లో మెడిసిన్ చేస్తుంటాడు. చదువులలో, ఆటల్లో అన్నింటా టాపర్ గా వున్నా అర్జున్ కు కోపం అనే వీక్ నెస్ వుంది. అయితే కాలేజీలో అర్జున్ రెడ్డి పేరు చెబితే.. ఎవరైనా గప్ చుప్ అయిపోవాల్సిందే. అదే కాలేజీలో ప్రీతీ(శాలిని పాండే) జాయిన్ అవుతుంది. తొలి చూపులోనే తనను ప్రేమించిన అర్జున్ చివరికి ప్రీతీని తన ప్రేమలో పడేలా చేసుకుని మానసికంగా, శారీరకంగా దగ్గర అవుతాడు. కాని ప్రీతి తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ప్రీతీకి వేరే అబ్బాయితో పెళ్లి కూడా చేసేస్తాడు. దీంతో సహజంగా కోపిష్టి అయిన అర్జున్ తట్టుకోలేక పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. తండ్రిపై కోపంతో ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోయి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో ఉద్యోగం చేసుకుంటూ అన్ని రకాల వ్యసనాలకు బానిసగా మారతాడు. మద్యం సేవించి సర్జరీలు కూడా  చేస్తుంటాడు. ఇది  మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించే నేరం. అనుకోకుండా హాస్పిటల్ లో చేసిన సర్జరి ఫైనల్ స్టేజ్ లో తనవల్ల కాక అసిస్టెంట్ నర్స్ తో చేయిస్తాడు. అలా కేసులో ఇరుక్కుంటాడు. మరి అర్జున్ రెడ్డి పై ఆ కేసు ప్రభావం ఎలా పడింది. చివరికి ప్రీతిని ఏ పరిస్థితుల్లో కలుసుకున్నాడు. గర్భవతిగా మారిన ఆ అమ్మాయిని ప్రేమకోసం పెళ్లి చేసుకున్నాడా అన్నదే అసలు కథ.

నటీనటులు:

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్రలో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో తండ్రితో తిట్లు తింటూ ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజ్ అయ్యే కుర్రాడు ఇతనేనా అనిపిస్తాడు. యారోగెంట్ గా, తేడాగా, ఒకరకంగా చెప్పాలంటే బాగా తిక్కగా ఉన్న అర్జున్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసాడు. తన చుట్టూ ఉన్న నిస్సహాయ పరిస్థితుల పట్ల అసహనం చూపించే పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. భవిష్యత్తులో విజయ్ ఎన్ని సినిమాలు చేసినా ఇదే అతని కెరీర్ టాప్ వన్ గా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు. కొన్ని చోట్ల బాడీ లాంగ్వేజ్ మితిమీరినట్టు అనిపించినా అది కథ డిమాండ్ మేరకే కాబట్టి అదొక్కటి క్షమించవచ్చు. మంచి సబ్జెక్ట్ పడితే తనలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడని విజయ్ దేవరకొండ మరో సారి రుజువు చేసాడు. ఇక హీరొయిన్ శాలిని పాండే చాలా క్యూట్ గా, హోమ్లీ గా అర్జున్ ప్రేమ కోసం తపించిపోయే ప్రియురాలిగా చాలా బాగా చేసింది. కానీ సెకండ్ హాఫ్ లో తనను మిస్ అయిన ఫీలింగ్ ఆ పాత్రను ఇష్టపడిన వాళ్ళకు ఇబ్బందిగా అనిపిస్తుంది. 

ఈ ఇద్దరి తర్వాత ఆకట్టుకునేది మాత్రం అర్జున్ రెడ్డి తో సమానంగా సినిమా మొత్తం ట్రావెల్ చేసిన ఫ్రెండ్ శివ పాత్ర వేసిన రాహుల్ రామకృష్ణ మాత్రం అదరగొట్టాడు. బక్కపలచని పర్సనాలిటీ తో హీరో యారోగెన్సి కి ధీటుగా పంచులు వేస్తూ కడుప్పుబ్బా నవ్వించే ఈ పాత్ర లేకుండా అర్జున్ రెడ్డిని ఊహించుకోవడం కష్టం. నెలసరి గురించి చెప్పిన డైలాగ్ కి నవ్వని ప్రేక్షకుడు లేడు. అలనాటి నటి కాంచన హీరో నాన్నమ్మగా చక్కగా చేసింది. హీరో అన్న కమల్ కామరాజు కూడా ఓకే.  సెకండ్ హీరొయిన్ జియా శర్మకు అంత మైలేజ్ ఇచ్చే పాత్ర కాదు. ఇక మిగిలిన వారందరూ సీన్ కు తగ్గట్టు కనిపించి చేసి వెళ్ళిన వారే

సాంకేతిక వర్గం:

దర్శకుడు సందీప్ వంగా తన సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు అందరు ఇది సహజమేలే అనుకున్నారు. కాని స్క్రీన్ మీద తనలో ఉన్న క్రియేటివ్ మేకర్ ని ఒక సరికొత్త ఫీల్ తో ఆవిష్కరించి మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు. ప్రేమ అనే ఎమోషన్ ని కోపం అనే ఎమోషన్ తో క్లాష్ చేసినప్పుడు ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో అర్జున్ రెడ్డి చేసే స్ట్రగుల్ ద్వారా సందీప్ ఆవిష్కరించిన తీరుకి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అవసరానికి మించి బోల్డ్ నెస్ చూపించినా అది వెగటు అనిపించకుడా బాలన్స్ చేయటంలో అతను చూపిన టెక్నిక్ నిజంగా ఫెంటాస్టిక్. భావోద్వేగాల మీద అదుపు లేనప్పుడు ఎంతటివాడైనా పతనం చూస్తాడు అనే నిజాన్ని చాలా సున్నితంగా చూపించడం కట్టిపడేస్తుంది. అర్జున్, ప్రీతీల ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగానే ఉంది కాని ప్రీతీ అతని ప్రేమలో సడన్ గా పడిపోవడం బహుషా లెంగ్త్ తగ్గించడం కోసం జరిగిన ఎడిటింగ్ లో మిస్ అయ్యుండొచ్చు. 

సందీప్ లో మాత్రం ఒక ఫ్రెష్ టాలెంట్ ఉందనేది మాత్రం ప్రూవ్ అయ్యింది. కాని పదే పదే అర్జున్, ప్రీతీ పాత్రల మధ్య ముద్దుల ప్రహసనం పెట్టడం ఎమోషన్ కోసమే అయినా మరీ ఇన్ని సార్లు అవసరమా అనిపిస్తుంది.రాదన్ సంగీతం అర్జున్ రెడ్డి మరో అతి పెద్ద బలం. ఇలాంటి ప్రేమ కథలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇందులో రాదన్ తన బిజిఎంతో వినిపిస్తాడు. పాటలు మరీ గొప్పగా లేనప్పటికీ విజువల్ గా చూస్తూ ఉంటె మాత్రం గుడ్ ఫీల్ క్యారీ చేయిస్తాయి. 

లెంగ్త్ కొంచెం ఎక్కువ అనిపించినా ఇప్పటికే అరగంట కట్ చేస్తేనే మూడు గంటలు వచ్చిందని దర్శకుడే చెప్పాడు కాబట్టి ఎడిటర్ శశాంక్ కు పెద్దగా పని చెప్పలేదు అనిపిస్తుంది. రాజు తోట సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. భద్రకాళి సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. భారీ బడ్జెట్ కాదు కాబట్టి స్పెషల్ గా మెన్షన్ చేయాల్సింది ఏమి లేదు

 ప్లస్ పాయింట్స్:

విజయ్ దేవరకొండ, మ్యూజిక్, దర్శకత్వం, రాహుల్ కామెడీ, ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్

నెగటివ్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లెంగ్త్, మరీ బోల్డ్ గా ఉన్న కొన్ని సీన్స్, బూతుల వాడకం ఎక్కువైంది

చివరిగా :

అర్జున్ రెడ్డిది అదోరకం మనస్తత్వం.. కానీ ప్రేమోన్మాదం మాత్రం కాదు. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మాత్రం అడల్ట్ కంటెంట్ దూరం చేస్తుంది.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే