
రామ్ చరణ్ ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ పూర్తి కావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. అయితే త్వరలోనే బుచ్చిబాబు సినిమాని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సమ్మర్‌లోనే ఈ మూవీ ప్రారంభం కానుందట. ఇందులో కాస్టింగ్‌కి సంబంధించిన వార్తలు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
`ఆర్‌సీ16` పేరుతో రూపొందబోతున్న ఈ చిత్రంలో ఇప్పటికే శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. ఆయనది చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. కోచ్‌గా కనిపిస్తారట. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో సాగుతున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌కి సపోర్టీవ్‌గా నిలిచే పాత్రలో ఆయన కనిపిస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో మూవీ సాగుతుందని ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు.
ఇప్పుడు మరో హీరో ఇందులో భాగం కాబోతున్నారట. ఆయన ఎవరో కాదు బాబీ డియోల్. ఇటీవల `యానిమల్` చిత్రంలో విలన్‌గా నటించి ఊపేశారు. ఆయన కనిపించింది కాసేపే అయినా అదరగొట్టారు. అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు సౌత్‌లో ఆయన బిజీగా మారుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో `హరి హర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్‌చరణ్ మూవీలోనూ కీలక పాత్రకోసం ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన పాత్ర సెకండాఫ్‌లో వస్తుందని అంటున్నారు. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియన్ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారు.