
దర్శకుడు వేణు ఎల్దండి బలగం మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. నటుడిగా, జబర్దస్త్ కమెడియన్ గా రాని గుర్తింపు దర్శకుడిగా మారి తెచ్చుకున్నాడు. బలగం మూవీ తెలుగు ఆడియన్స్ కి ఎంతగానో నచ్చేసింది. తెలంగాణ పల్లె జీవనాన్ని, కుటుంబాల మధ్య మనస్పర్థలు, ప్రేమలు, సాంప్రదాయాలు ఆయన తెరకెక్కించిన తీరు అబ్బురపరిచింది. అంతర్జాతీయ వేదికల మీద కూడా బలగం సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు నలభైకి పైగా అవార్డ్స్ బలగం మూవీ గెలుచుకుంది.
కాగా తాజా ఉందంతం ఆ సినిమా క్రేజ్ ఏపాటిదో తెలియజేసింది. బలగం మూవీకి సంబంధించిన ప్రశ్న తెలంగాణ కానిస్టేబుల్ నియామక పరీక్షలో దర్శనమిచ్చింది. మార్చి 30న తెలంగాణా కానిస్టేబుల్ మెయిన్ రాత పరీక్ష జరిగింది. ఈ పేపర్స్ లో 'ఏ విభాగంలో బలగం మూవీ 2023 ఒనికో ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది?' అని అడిగారు. ఇది ఆబ్జెక్టివ్ ప్రశ్న. ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ సంభాషణ అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు.
దీనికి సరైన సమాధానం ఉత్తమ నాటకం. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలో బలగం మూవీ గురించి ప్రశ్న రావడం సాధారణ విషయం కాదు. దిల్ రాజు బలగం చిత్రాన్ని నిర్మించారు. థియేటర్స్ లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం త్వరగా ఓటీటీలోకి వచ్చేసింది. లేదంటే మరిన్ని అద్భుతాలు చేసేది.
ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ దక్కింది. పల్లెటూళ్లలో బలగం చిత్ర బహిరంగ ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రాత్రిళ్ళు బలగం మూవీని జనాలంతా ఒక చోట చేరి వీక్షించారు. ఏళ్లుగా మనస్పర్థలతో విడిపోయిన కుటుంబాలు బలగం మూవీతో ఒక్కటయ్యాయి. వారి మనసులు మార్చి బలగం మూవీ దగ్గర చేసింది. కాకి ముట్టుడు అనే సంప్రదాయం చుట్టూ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అల్లి, వేణు గొప్పగా నడిపించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా నటించారు.