"అమీ తుమీ" మూవీ రివ్యూ

First Published Jun 9, 2017, 2:49 PM IST
Highlights
  • చిత్రం: అమీ తుమీ
  • తారాగణం : అడవి శేష్, అవసరాల శ్రీనివాస్,  వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకల్, తనికెళ్ల భరణి
  • సంగీతం : మణిశర్మ
  • దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
  • నిర్మాత : కె.సి. నరసింహారావు
  • ఏసియానెట్ రేటింగ్ : 3/5

కథ :
అమీ తుమీ మూడు జంటల ప్రేమకథ. సినిమా మొదలవ్వటానికి ముందే ప్రేమలో ఉన్న అనంత్(అడవి శేష్), దీపిక(ఈషా)ల పెళ్లికి దీపిక తండ్రి జనార్థన్(తనికెళ్ల భరణి) ఒప్పుకోడు, తాను చూసిన శ్రీ చిలిపి( వెన్నెల కిశోర్)నే పెళ్లి చేసుకోవాలని చెప్పి దీపికను గదిలో బంధిస్తాడు. అంతేకాదు తనకు వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన గంగాదర్ కూతురు మాయ(అదితి మైకల్)ను తన కొడుకు విజయ్(అవసరాల శ్రీనివాస్) ప్రేమిస్తున్నాడని తెలిసి కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పంపేస్తాడు. గదిలో ఉన్న దీపిక, పనిమనిషి కుమారి(శ్యామల) సాయంతో తప్పించుకొని పారిపోతుంది. అదే సమయంలో గంగాదర్ కూతురు.. మాయ కూడా ఆస్తి కోసం సవతి తల్లి పెట్టే బాదలు భరించలేక ఇళ్లు వదిలి బయటకు వచ్చేస్తుంది. తరువాత వీరిద్దరు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు..? దీపిక ను చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీ చిలిపి ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
హీరోలుగా అడవి శేష్, అవసరాల శ్రీనివాస్ కనిపించినా.. సినిమా అంతా వెన్నెల కిశోర్ షోలా నడిచింది. తన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‑తో ఆడియన్స్‑ను కడుపుబ్బా నవ్వించాడు కిశోర్. తాను సీరియస్ గా ఉంటూనే కామెడీ చేసి బ్రహ్మానందం లాంటి సీనియర్లను గుర్తు చేశాడు. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ తనికెళ్ల భరణి, తన మార్క్ తెలంగాణ యాసలో కితకితలు పెట్టాడు. కూతురి ప్రేమను కాదని తన స్వార్థం కోసం తనకు నచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేయాలనే క్రూరమైన తండ్రి పాత్రలో కూడా మంచి కామెడీ పండించాడు. అడవి శేష్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకేల్, కేదార్ శంకర్‑లు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి తనదైన హాస్య కథతో అలరించాడు. హాస్యం అంటే ద్వంద్వార్థాలు, పేరడీలే అనుకుంటున్న సమయంలో కుటుంబసమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన హాస్య కథా చిత్రాలతో అలరిస్తున్న మోహన కృష్ణ, మరోసారి అదే తరహా ప్రేమ కథలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ యాసలో తనికెళ్ల భరణి, ఇంగ్లీష్, తెలుగు కలిపి వెన్నెలకిశోర్ చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లో విజిల్స్ పడతాయి. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్. సాధారణ సన్నివేశాలతో కూడా మణి తన మ్యూజిక్ మరింత ఫన్నీగా మార్చేశాడు. పిజీ విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంటేష్ ఎడిటింగ్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి అతి పెద్ద బలం ఎవరంటే నిస్సందేహంగా వెన్నెల కిశోర్ అని చెప్పొచ్చు. శ్రీ చిలిపి అనే అతని పేరు దగగర్నుంచి హాస్యం నిండిన అతని బాడీ లాంగ్వేజ్, మాటలు, నటన చాలా బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్ చెప్పే సమయంలో అతని టైమింగ్ పూర్తి స్థాయిలో వర్కవుట్ అయింది. ఇక కథలో కీలకమైన మరో పాత్ర పని మనిషి కుమారి (శ్యామల దేవి) కూడా చాలా బాగా నటించింది. వెన్నెల కిశోర్ తో కలిసి ఆమె పండించిన హాస్యం కొత్తగా బాగుంది.

అలాగే హీరోయిన్ ఈషా రెబ్బ కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతూనే, అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తాను ఎంచుకున్న కామెడీ జానర్ కు సింపుల్ కథతో, ఫన్ నిండిన స్క్రీన్ ప్లేతో, కథకు సరిగ్గా సరిపోయే పాత్రలతో మంచి ఎంటర్టైన్మెంట్ అందించి పూర్తిగా న్యాయం చేశాడు. ఎక్కడా అనవసరమైన, రొటీన్ సన్నివేశాలు, పాటలను కథనంలో ఇరికించకుండా ఆరోగ్యకరమైన హాస్యంతో ఒకే గమ్యం వైపు కథనాన్ని నడిపి మంచి సినిమాను చూసిన భావనను కలిగించారు.

చాలా పాత్రలు పూర్తిగా కథకు సంబంధించినవై, ముఖ్యమైనవై ఉండటం వలన ప్రతి చోట ఆసక్తికరంగానే అనిపించాయి. అలాగే ప్రతి పాత్ర నుండి దర్శకుడు కామెడీని జనరేట్ చేయడంతో సినిమా చూస్తున్న రెండు గంటలు ఎక్కడా కష్టంగా అనిపించలేదు.

మైనస్ పాయింట్స్ :

హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన తనికెళ్ళ భరణి కాస్త ఎక్కువ సేపు కనిపించడం, ఓవర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఒకటి రెండు చోట్ల ఇబ్బంది కలిగించింది. కథ మొదట్లో కనిపించిన శ్రీనివాస్ అవసరాల తర్వాతి కథనంలో మంచి ఫన్ ఇస్తాడేమోనని ఆశిస్తే ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో కాస్తంత నిరుత్సాహం కలిగింది.

ఇక కథకు ప్రధానమైన రెండు ప్రేమ జంటల మధ్య కెమిస్ట్రీ లేకపోవడంతో సినిమాలో రొమాంటిక్ ఫీల్ మిస్సయింది. కథనంలో వెన్నెల కిశోర్ పాత్రను ఇబ్బందిపెట్టే కొన్ని సందర్భాలు కూడా కాస్తంత అసహజంగా అనిపించాయి. అంతేగాక అతని అసిస్టెంట్ పాత్ర కూడా కొన్ని చోట్ల బలవంతంగా దూరిపోయి బరువుగా తోచింది.

 

చివరగా :

అమీ తుమీ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ  హెల్దీ  కామెడీ ఎంటర్ టైనర్

click me!