
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా కలెక్షన్స్ మాట ఎలా ఉన్నా అంబటి వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. అంబటిని తలపించే శ్యామ్‌బాబు పాత్రలో పృధ్వి నటించటం ఆయనకు కోపం తెప్పించింది. ఈ నేఫద్యంలో ‘బ్రో’ చిత్రంలో ఆయనకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. డైలాగులు చాకచక్యంగా ఉన్నప్పటికీ, ఈ వ్యూహాల వెనుక ఎవరున్నారో తెలుసునని అంబటి పేర్కొన్నారు. దమ్ముంటే డైరెక్ట్ పొలిటికల్ సినిమాలు తీయాలని, కుటిల వ్యాఖ్యలు ఎందుకని ఎద్దేవా చేశారు.
త్రివిక్రమ్ లాంటివారు ఇకపై ఇలాంటివి రిపీట్ చేస్తే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. “సినిమాల్లో ఎవణ్ణి పడితే వాన్ని గోకితే సక్సెస్ కావు అని నిర్మాతలు, నటులు తెలుసుకోవాలి. దమ్ముంటే మొత్తంగా పొలిటికల్ సెటైరికల్ మూవీస్ తీసుకోవచ్చు. దానిలో ఎవరి పేరు అయినా పెట్టుకోవచ్చు. శ్యామ్ బాబు ఎందుకు రాంబాబు అని పెట్టుకొండి. ఎవడూ కాదన్నాడు,” అంటూ మంత్రి మాట్లాడారు. రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు మరోసారి ఇలాంటి ఎత్తుగడలు వేస్తే తగిన గుణపాఠం చెబుతామని అంబటి స్పష్టం చేశారు.
ఇక బ్రో సినిమాలో మరొక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించారు. ఈ సినిమా తమిళ్ లో రూపొందిన వినోదయ సిత్తం సినిమాకి రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసి తెరకెక్కించారు. ముఖ్యంగా రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాయటం తో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మెల్లిమెల్లిగా మిక్స్డ్ రివ్యూస్ ప్రారంభం మొదలయ్యాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు అని పెదవి విరిచేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో మైనస్ ల చర్చ మొదలైంది. హిట్ అయితే కనపడనవి ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ ని సోషల్ మీడియా జనం టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రాస పేరుతో త్రివిక్రమ్ రాసిన కొన్ని డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. ముఖ్యంగా ఓ డైలాగు అయితే విపరీతమైన ట్రోలింగ్ అవుతోంది.
హాల్లో షర్ట్ విప్పొచ్చు
బెడ్ రూంలో ప్యాంట్ విప్పొచ్చు
బాత్ రూంలో అండర్ వేర్ కూడా విప్పొచ్చు
కానీ వీడిని ఎక్కడ విప్పాలో తెలియదు
ఈ డైలాగు ప్రాస కోసం వాడారా లేక ఎవరినైనా టార్గెట్ చేస్తూ రాసారా అనే సందేహం కలిగింది చాలా మందికి.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ప్రజాక్షేత్రంలో బట్టలు ఊడదీసి నిలబెడతా అని ఈ మధ్య పొలిటికల్ స్పీచుల్లో పవన్ కళ్యాణ్ అంటున్నారు. దానికి రిలేట్ చేస్తూ ఈ డైలాగ్ వాడారు అని కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు. నిజమేమో కానీ ఎవరికి తోచినట్లు వాళ్లు సినిమాని అర్దం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.