తెలుగు తెరపైకి మరో తెలుగమ్మాయి సందడి చేయబోతుంది. `అంబాజీపేట మ్యారేజి బ్యాండు`లో మెరవబోతుంది. మరోవైపు `హ్యాపీ ఎండింగ్`తో అది రిస్క్ అంటున్నాడు నిర్మాత.
టాలీవుడ్‌లో చాలా అరుదుగా తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా సందడి చేస్తుంటారు. అవకాశాలు రావడం చాలా తక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు అమ్మాయిలకు ఆదరణ దక్కుతుంది. మొన్న `బేబీ`తో వైష్ణవి చైతన్య రచ్చ చేసింది. సెన్సేషన్‌గా మారింది. వరుసగా ఆఫర్లని అందుకుంటుంది. ఇప్పుడు సుహాస్ హీరోగా నటించిన `అంబాజీపేట మ్యారేజి బ్యాండు`తో మరో అమ్మాయి శివానీ నాగరం రాబోతుంది. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందింది. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ మూవీ రాబోతుంది.
ఈ సందర్భంగా శివానీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. సెకండ్ లీడ్ కోసం ఆడిషన్‌కి వెళ్తే హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలిపింది. అది తనకు అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది శివాని. హైదరాబాద్‌కి చెందిన శివానీ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యింది. వెబ్ సిరీస్ మంచి గుర్తింపు తెచ్చింది. అలా ఇప్పుడు సినిమా ఆఫర్ కొట్టేసింది. `బేబీ` సినిమాతో వైష్ణవి హిట్ కొట్టి సంచలనంగా మారిననేపథ్యంలో తనకు కూడా ఈ సినిమాలోని పాత్ర అంతటి పేరు తెస్తుందని, అంతటి విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నట్టు తెలిపింది.
తెలుగుమ్మాయిలకు ఇప్పుడు చాలా ప్రోత్సాహం లభిస్తుందని, ఓటీటీలు, యూట్యూబ్ వచ్చాక చాలా మారిపోయిందని, టాలెంట్‌ని నిరూపించుకోవడానికి ఉపయోగ పడుతుందని, తనకు కూడా ఓటీటీలు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపింది. ఇందులో తాను లక్ష్మి పాత్రలో నటించినట్టు చెప్పింది. లవ్ స్టోరీ మాత్రమే కాదు, చాలా బలమైన సంఘర్షణ, ఎమోషన్స్ ఉంటాయని, తన పాత్రకి ప్రయారిటీ ఉంటుందని తెలిపింది. శరణ్య పాత్ర సినిమాకి మెయిన్‌గా ఉంటుందని చెప్పింది. సుహాస్‌తో పనిచేయడం గొప్ప అనుభవం అని, తను మంచినటుడు అని, ఎంతో సపోర్ట్ చేసినట్టు తెలిపింది. సినిమాకి ముందు చాలా రోజు వర్క్ షాప్ చేసి ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లామని చెప్పింది. దర్శకుడు చాలా ప్రోత్సహించారని, అలాగే నిర్మాతలు ఎంకరేజ్ చేశారని తెలిపింది శివానీ.
ఇప్పుడు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం, మేకర్స్ ప్రోత్సహించడం చాలా హ్యాపీగా ఉందని, ఇది మంచి పరిణామం అని చెప్పింది. అయితే ఎవరినీ తీసుకోవాలనేది మేకర్స్ అభిప్రాయం అని, వాళ్ల నిర్ణయాలను తప్పుపట్టలేమని చెప్పింది. ఇక తనకు నచ్చిన హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, అల్లుఅర్జున్, నాని అని చెప్పింది. హీరోయిన్ సావిత్రి అని వెల్లడించింది. ఈ సినిమా విడుదలైయ్యాక కొత్త ఆఫర్లని ఎంచుకుంటానని తెలిపింది.
`హ్యాపీ ఎండింగ్`లో రిస్క్ అదే.. నిర్మాత అనిల్ పల్లాల..
యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా `హ్యాపీ ఎండింగ్`. అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ ను నిర్మాత అనిల్ పల్లాల వెల్లడించారు.
తాము చాలా కాలంగా సినిమాలపై ఎనాలసిస్ చేసినట్టు చెప్పారు. ఏడాదికి ఐదు వందల సినిమాలు రిజిస్టర్ అయితే అందులో 150 నుంచి 200 మాత్రమే తెరకెక్కి రిలీజ్ అవుతున్నాయని, మిగిలిన సినిమాలు ఏమవుతున్నాయని పరిశోధించినప్పుడు చాలా మంది నిర్మాతలకు అనుభవ లేమి కారణంగా మోసపోతున్నారని, బడ్జెట్ ఎక్కువ పెట్టి, సినిమా బాగా రాక విడుదల చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చామని తెలిపారు అనిల్.
తాను కథలను ఎంపిక చేసి, స్క్రిప్ట్ వర్క్ చేసిన ప్రీ ప్రొడక్షన్ చేసి రెడీగా ఉంచుతామని, ఇన్వెస్టర్లని పట్టుకుని అనుకున్న బడ్జెట్‌లో సినిమాని తీసి విడుదల చేస్తామని తెలిపారు. అలాంటి కాన్సెప్ట్ లోనే ఈ `హ్యాపీ ఎండింగ్` చిత్రం వచ్చిందన్నారు. ఇది ఫీలింగ్స్ ప్రధానంగా నడుస్తుంది. దేవుడి శాపం వల్ల ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేని ఒక వ్యక్త జర్నీని, ఫన్నీ వేలో చూపించినట్టు తెలిపారు. అన్ని అంశాల మేళవింపుతో సినిమా సాగుతుంది. ట్రెండీగా ఉంటుందన్నారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు హిందీలో ఆడాయి, మన వద్ద ఎలా రిసీవ్ చేసుకుంటారనేది రిస్కే పాయింటే, కానీ కాలం మారింది, ట్రెండ్ మారింది, ఆడియెన్స్ అభిరుచి కూడా మారింది, అలా ఈ మూవీ నెమ్మదిగా ఆడియెన్స్ లోకి వెళ్తుందని, వారిని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నట్టు తెలిపారు. సినిమా చూశాక హ్యాపీ ఫేస్‌తో బయటకు వస్తారని తెలిపారు నిర్మాత అనిల్.