
పుష్ప (Pushpa) మేనియాతో దేశం మొత్తం ఊగిపోతోంది. ముఖ్యంగా హిందీ జనాలకు ఈ మూవీ తెగ నచ్చేసింది.బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ తో రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత వంద కోట్ల వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా పుష్ప రికార్డులకెక్కింది. పుష్ప విజయంతో అల్లు అర్జున్ (Allu Arjun) ఇమేజ్ పెరిగింది. ఇమేజ్ పెరిగితే బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అందుకే పలు వ్యాపార సంస్థలు ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ ని సంప్రదిస్తున్నాయి.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) ప్రచార కర్తగా బన్నీ వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన యాడ్ బన్నీపై షూట్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ వీడియో వైరల్ గా మారింది. యాక్టర్ సుబ్బరాజ్ గోగూర మటన్ కావాలని అడుగుతుంటే... బన్నీ జొమాటలో ఆర్డర్ చెయ్ అంటున్నారు. ఎనీ ఐటెం ఎనీ టైం దొరుకుతుందని హామీ ఇస్తున్నారు. ఈ యాడ్ లో అల్లు అర్జున్ లుక్ డిఫరెంట్ గా ఉంది. ఆయన గడ్డాన్ని కొంచెం ట్రిమ్ చేశారు. పుష్ప పార్ట్ 2 షూటింగ్ కి కొంచెం సమయం ఉన్న నేపథ్యంలో గడ్డం తగ్గించారు.
పుష్ప ఇంత పెద్ద విజయం సాధించగా... ప్రముఖ అవధాని, మోటివేషనల్ స్పీకర్ గరికపాటి నరసింహారావు తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఓ స్మగ్లర్ తగ్గేదేలే అనడం ఏమిటంటూ నిలదీశారు. మంచికి మారుపేరైన హరిచంద్రుడో, రామ చంద్రుడో తగ్గేదేలే అంటే సమాజహితం. కానీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే స్మగ్లర్ చేత ఇలాంటి డైలాగులు ఎలా చెప్పిస్తారంటూ నిలదీశారు. పుష్ప హీరో కానీ, దర్శకుడు కానీ కనిపిస్తే కడిగిపారేస్తా అంటూ ఫైర్ అయ్యారు.
గరికపాటి (Garikapati narasimharao) వ్యాఖ్యలకు పుష్ప యూనిట్ నుండి ఎవరూ స్పందించలేదు. ఆయన వ్యాఖ్యలను సమర్ధించడం కానీ ఖండించడం కానీ చేయలేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం గరికపాటికి కౌంటర్లు ఇస్తున్నారు. కథలో భాగంగా వాడిన ఓ డైలాగ్ గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు.
మరోవైపు పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ పుష్ప పార్ట్ లో కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. మిగతా భాగం పూర్తి చేసి 2022 డిసెంబర్ లో పుష్ప పార్ట్ 2 విడుదల చేస్తారట. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా... మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.