
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత రెండేళ్లుగా ఒకే లుక్ మైంటైన్ చేస్తున్నారు. పుష్ప మూవీ కోసం ఆయన జుట్టు, గడ్డం విపరీతంగా పెంచేశాడు. అల వైకుంఠపురంలో చిత్రీకరణ నాటి నుండే అల్లు అర్జున్ జుట్టు పెంచడం ప్రారంభించారు. ఇక పుష్పలో ఆయన టోటల్ డీగ్లామర్ లుక్ ట్రై చేశారు. మాసిన బట్టలు, జుట్టు, గడ్డంలో కనిపించారు. అల్లు అర్జున్ కెరీర్ లో మొదటిసారి డీగ్లామర్ రోల్ చేయగా విశేష స్పందన దక్కింది. ముఖ్యంగా పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మేనరిజం బాగా హైలెట్ అయ్యాయి. తగ్గేదెలే డైలాగ్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్ కూడా ఉండగా అల్లు అర్జున్(Allu Arjun) సేమ్ గెటప్ మైంటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ సెలెబ్రిటీ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ముంబైకి చెందిన సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఫోటో షూట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ దానికి సంబంధించిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. మెస్సీ హెయిర్ తో అల్లు అర్జున్ మాస్ లుక్ ఆకట్టుకుంటుంది. ఉంగరాల జుట్టు కాస్తా స్ట్రయిటెన్ చేయగా గుబురు గడ్డంలో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆసక్తి రేపుతోంది.
ఇక అల్లు అర్జున్ లేటెస్ట్ లుక్ పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య అల్లు అర్జున్ కొంచెం వెయిట్ పెరిగారు. ఈ క్రమంలో ఆయన లుక్ పై ట్రోల్స్ వస్తున్నాయి. మరోవైపు ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. పుష్ప పార్ట్ 1 భారీ సక్సెస్ అందుకోగా పార్ట్ 2 అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఏకంగా రూ. 350 కోట్లు కేటాయించినట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ ఈ క్రమంలో స్క్రిప్ట్ కి మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తుంది.
రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. సునీల్, అనసూయ సీక్వెల్ కూడా నటించనున్నారు. కొత్తగా విజయ్ సేతుపతి జాయిన్ అయినట్టు సమాచారం అందుతుంది.