
‘కేజీఎఫ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో పవర్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గతంలోనే ‘సలార్’ అనే సాలిడ్ టైటిల్ కూడా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఒక్కో షెడ్యూల్ ను చాలా జాగ్రత్తగా, బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఆలస్యం లేకుండా షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసిన ‘సలార్’ టీం.. తర్వలో మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా హాజరు కానున్నారు.
ఇప్పటి వరకు జరిగిన షెడ్యూళ్లతో చిత్రం సగానికిపైగా షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విలన్, హీరో మధ్య సాగే సన్నివేశాలు, పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, కీలక సన్నివేశాలను చిత్రకరించే దశలో ఉందీ చిత్రం. నెక్ట్స్ షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్ వీటిపైనే ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఆగస్టు మొదటి వారంలోనే ‘సలార్’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించనున్న మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ షెడ్యూల్ లోనే సలార్ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు.
ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ కొన్ని వినిపిస్తున్నాయి. తదుపరి షెడ్యూల్ తో ప్రభాస్ షూటింగ్ పార్ట్ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ - ప్రభాస్ మధ్య సాగే సన్నివేశాల చిత్రీకరణతో సినిమా మరో దశకు రానుంది. ఇప్పటి జరిగిన చిత్రీకరణ వరకు టాకీ పార్ట్ కూడా ఈ షెడ్యూల్ లోనే ముగినుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఓ భారీ లోయలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారని సమాచారం. ఇప్పుడు చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు.
ఇక మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నాడు. హీరోగా మంచి డిమాండ్ ఉన్న ఈ నటుడు సలార్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ‘అప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగు రీమేగా ‘భీమ్లానాయక్’తో వచ్చిన విషయం తెలిసిందే. అలాగే పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ‘లూసీఫర్’ సినిమాకు రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ కు సిద్ధమవుతోంది. సలార్ తర్వాత మలయాళ స్టార్ కు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ చిత్ర షూటింగ్ లో ఉన్నారు. ఈ నెలతో ప్రస్తుతం షెడ్యూల్ ముగినుంది. ఆ వెంటనే కొత్త షెడ్యూల్ తో ‘సలార్’సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు ప్రభాస్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన గ్లామర్ హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruthi Haasan) ఆడిపాడనుంది. నిర్మాత విజయ్ కిరగందూర్ రూ.200 కోట్లతో భారీ యాక్షన్ ఫిల్మ్ ను నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ నే సంగీతం అందిస్తుండటం విశేషం.