
కాశ్మీర్ ఫైల్స్ (kashmir files ), గో రక్షకులపై సినీ నటి సాయి పల్లవి (sai pallavi) చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో చిత్ర బృందానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆమె తెలిపారు. ఏ మతంలోనైనా హింస మంచిది కాదని చెప్పానని సాయి పల్లవి స్పష్టం చేశారు. తాను ఎవరినీ కించపరచలేదని.. తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పేనని ఆమె పేర్కొన్నారు.
ఓ డాక్టర్‌గా ప్రాణం విలువ తనకు తెలుసునని.. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికీ లేదని సాయి పల్లవి స్పష్టం చేశారు. మూక దాడులను సమర్ధించేవారు ఆన్‌లైన్‌లో చాలా మంది కనిపించారంటూ ఆమె వ్యాఖ్యానించారు. అలాంటి వారిని చూసి తనకు చాలా ఆశ్చర్యం వేసిందని సాయిపల్లవి అన్నారు. ఓ డాక్టర్‌గా అన్ని ప్రాణులను సమానంగా చూస్తానని ఆమె స్పష్టం చేశారు. తన ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా మాట్లాడుతున్నారని సాయిపల్లవి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం ఏ రూపంలో వున్నా సమర్ధించనని ఆమె స్పష్టం చేశారు.
కాగా.. రానా దగ్గుబాటి , సాయిపల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది ఈమూవీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొన్ని రోజుల ముందు కూడా నేను ఈ కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కద.. సో.. కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్లు చూపించారు ఎట్లా చంపారు. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎట్లా చంపారనేది చూపించారు కద. కోవిడ్ టైంలో ఎవరో If You Taking A Religious Conflict లాగా తీసుకుంటే రీసెంట్‌గా ఎవరో ఒక బండిలో ఆవుని తీసుకెళుతున్నారు.
ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు. కొన్ని జనాలు కొట్టి జై శ్రీరాం.. జై శ్రీరాం అని చెప్పారా. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ తేడా ఎక్కడ ఉంది..? అంటూ క్యాజువల్ గా కామెంట్ చేసింది. అంతేకాదు ఇప్పుడు మనం Religious పేరులో మనం మంచిగా ఉండాలి. మనం మంచి పర్సన్‌గా ఉండి ఉంటే హర్ట్ చేయం. ఒక పర్సన్ పైన ఆ ప్రెజర్ పెట్టం అని సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. సాయిపల్లవి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు కశ్మీరీ పండిట్స్‌ను గోవుల అక్రమ రవాణా చేసిన వారితో పోల్చడమేంటని ఆమెపై మండిపడుతున్నారు.