
ఆడవాళ్ళకే కాదు పరిశ్రమలో మగాళ్లకూ రక్షణ లేదట. మేల్ యాక్టర్స్ కి కూడా లైంగిక వేధింపులు కామన్ అని తెలుస్తుంది. ఈ మేరకు నటుడు రవి కిషన్ క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూలో రవి కిషన్ మాట్లాడుతూ... పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. దాన్ని నుండి నేను తప్పించుకున్నాను. జీవితంలో ఎదిగేందుకు అడ్డదారులు తొక్కొద్దని మా నాన్న చెప్పారు. నీకున్న ప్రతిభను నిరూపించుకుని నిజాయితీగా ఎదిగే ప్రయత్నం చేయమన్నారు. నాకు టాలెంట్ ఉందని నమ్మాను కాబట్టే నేను షార్ట్ కట్స్ వెతుక్కోలేదు.
పరిశ్రమకు చెందిన ఓ మహిళ నన్ను కాఫీకి ఆహ్వానించింది. కాఫీ అంటే ఉదయమో, సాయంత్రమో తాగుతారు. ఆమె నన్ను రాత్రివేళ రమ్మన్నారు. ఆమె ఇన్నర్ ఫీలింగ్ అర్థం చేసుకున్న నేను తిరస్కరించాను. కాఫీకి రావడం కుదరదన్నాను. ఆమె పేరు నేను చెప్పను. ఇప్పుడు ఆమె చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. అలా నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడిని అయ్యానని రవి కిషన్ చెప్పుకొచ్చారు.
బాల్యం నుండి నటుడు కావాలన్న నా కలను మా అమ్మ ప్రోత్సహించారని రవికిషన్ చెప్పుకొచ్చారు. రవి కిషన్ పరిశ్రమకు వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు అవుతుంది. ఆయన హిందీ, భోజ్ పురి చిత్రాల్లో అధికంగా నటించారు. రేసు గుర్రం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ మూవీ సూపర్ హిట్ కాగా ఆయనకు ఇక్కడ వరుస ఆఫర్స్ వచ్చాయి. సుప్రీమ్, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, సైరా నరసింహారెడ్డితో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించారు.
రవి కిషన్ రాజకీయ నాయకుడిగా కూడా రాణిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. 2019 లో గోరఖ్ పూర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఎంపీ అయ్యారు. బీజేపీ పార్టీలో ఆయన కీలక నాయకుడు అయ్యారు.