
యువ దర్శకుడు, నిర్మాత అభిషేక్ నామా తన తాజా చిత్రం నాగబంధం కోసం హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని రీ క్రియేట్ చేస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో నాగబంధం అనే పీరియాడిక్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ స్థాయిలో అనంత పద్మనాభ స్వామి ఆలయ సెట్ నిర్మిస్తున్నారట.
ఈ సెట్ నిర్మాణం కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ, “ఈ సెట్ నిర్మాణానికి చాలా శ్రమించాం. ఎంతో రీసెర్చ్ చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ని రీ క్రియేట్ చేశాం. మేము చేసిన పనితో చాలా సంతృప్తిగా ఉన్నాం. నిజమైన ఆలయాల్లో షూటింగ్స్ చేయాలంటే అనుమతులు, సెక్యూరిటీ సమస్యలు చాలా ఉంటాయి. అనంతపద్మనాభ స్వామి లాంటి ప్రఖ్యాత ఆలయంలో షూటింగ్ చేయడం కుదరని పని. అందుకే స్టూడియోలోనే పూర్తి నిజమైన అనుభూతిని కలిగించేలా ఆలయాన్ని రీక్రియేట్ చేశాం” అని తెలిపారు.
ఈ చిత్రంలో పద్మనాభ స్వామి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండటంతో ఆలయ సెట్ నిర్మాణం అవసరం అయింది. ప్రేక్షకులు నిజమైన ఆలయం చూస్తున్నట్లు అనుభూతి చెందేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. “ఈ సినిమా హిందూ మతాన్ని గౌరవించే విధంగా ఉంది. ఇది పూర్తిగా భక్తి, మనోభావాల చుట్టూ తిరిగే కథ. దాంతో, ఆలయ సెట్స్ లో ఎటువంటి విమర్శలకు ఆస్కారం ఉండకూడదనే జాగ్రత్తలు తీసుకున్నాం,” అని అభిషేక్ స్పష్టం చేశారు.
సమాచారం ప్రకారం, ఈ ఒక్క సెట్లోనే రూ.10 కోట్లు ఖర్చు కాగా, ఇతర 8–9 భారీ సెట్స్ కోసం మరో రూ.30 కోట్లు వ్యయం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర బడ్జెట్ లెక్కలు చెప్పకుండా అభిషేక్ ఈ సినిమా భారీ స్థాయిని అంగీకరించారు. “ఇది పీరియడ్ డ్రామా. అందుకే ఆ కాలాన్ని ప్రతిభింబించేలా సెట్స్ ఉండాలి. ఆ విజువల్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. సెట్స్ అనేవి అవసరం మాత్రమే కాదు, క్రియేటివ్ ఛాయిస్ కూడా,” అని అన్నారు.నాగబంధం చిత్రంలో కేవలం సెట్స్ నిర్మాణం కోసమే 40 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది.
ఆర్ట్ డైరెక్టర్ అశోక్, నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి గారి సహకారం గురించి అభిషేక్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. “అశోక్ గారు మేము ఊహించిన దానిని నిజంగా చూపించే మాస్టర్. కిషోర్ గారు స్క్రిప్ట్‌ని పూర్తిగా అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా మద్దతిచ్చారు,” అని చెప్పారు.
అభిషేక్ నామా మాట్లాడుతూ, “తెలుగు చిత్రసీమలో ఇలాంటి సెట్స్ సృష్టించడం కొత్త కాదు. మహేశ్ బాబు సినిమా కోసం మదురై మీనాక్షి ఆలయం సెటప్ చేశారు. 20 సంవత్సరాల క్రితం చార్మినార్ ను కూడా సెటప్ చేశారు. నిజమైన ప్రదేశాల్లో పరిమితులు ఉంటాయి. కానీ సెట్స్ వల్ల సృజనాత్మక స్వేచ్ఛ లభిస్తుంది,” అన్నారు.
విక్రాంత్ కర్ణ హీరోగా నటిస్తున్న నాగబంధం సినిమా, భక్తి భావన, హిందూమత సంప్రదాయాలను దేశవ్యాప్తంగా ప్రతిబింబించే లక్ష్యంతో రూపొందుతోంది అని అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
అభిషేక్ నామా గతంలో కళ్యాణ్ రామ్ తో డెవిల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు ఆయన నాగబంధం చిత్రంతో దర్శకుడిగా మరో ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెట్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.