హైదరాబాదులో రజనీకాంత్ కు తీవ్ర అస్వస్థత: అపోలోలో చికిత్స

By telugu teamFirst Published Dec 25, 2020, 1:29 PM IST
Highlights

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అన్నాతే షూటింగ్ కోసం హైదరాబాదు వచ్చిన రజినీకాంత్ 22వ తేదీ నుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ రోజు ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు.

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఆయన హైదరాబాదులో హోం క్వారంటైన్ లో ఉన్నారు. రజినీకాంత్ జుబిలీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.రజినీకాంత్ తో పాటు ఆయన కూతురు ఐశ్వర్య ఆస్పత్రికి వచ్చారు.

రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. హై బీపీ కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. అన్నాతే సినిమా షూటింగ్ కోసం రజినీకాంత్ ఇటీవల హైదరాబాదు వచ్చారు. రామోజీ ఫిల్స్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా బృందంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. 

దాంతో రజినీకాంత్ ఈ నెల 22వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లారు. అకస్మాత్తుగా శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. 

ఈ రోజు ఉదయం 9 గంటలకు రజినీకాంత్ ఆస్పత్రిలో చేరారు. రజినీకాంత్ కు బీపీ హెచ్చుతగ్గులు మాత్రమే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో వైద్యులు చెప్పారు. ఫోన్లు కూడా చేయవద్దని కోరారు.

రజినీకాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చిందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. రజినీకాంత్ కు కోవిడ్ లక్షణాలు లేవని వైద్యులు చెప్పారు. ఈ నెల 31వ తేదీన ఆయన తన పార్టీ వివరాలను ప్రకటించాల్సి ఉంది. తమిళనాడులో ఆయన కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి సిద్ధమైన విషయ తెలిసిందే. ఈ స్థితిలో అన్నాతే షూటింగును ఆఘమేఘాల మీద పూర్తి చేయడానికి హైదరాబాదు వచ్చారు. అనూహ్యంగా కోవిడ్ రూపంలో షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది.

click me!