
చాలా కాలంగా బాలయ్య, బోయపాటి చిత్రం గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మొత్తానికి నిన్న గ్రాండ్ గా హైదరాబాద్ లో సినిమా మొదలైంది.‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో సూపర్ హిట్ కాంబినేషన్‌గా పేరుపొందిన బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ చిత్రం ప్రారంభమైంది. NBK106గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది. ఈ చిత్రంలో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యి అనేక సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించిన హాట్ యాంకర్ రేష్మి గౌతమ్ కీలకమైన పాత్రలో కనిపించనుందిట.
ఈ మేరకు రేష్మితో బోయపాటి ఇప్పటికే చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె నెగిటివ్ రోల్ పోషిస్తారని చెప్తున్నారు. సినిమాలో ఓ కీలకమైన సమయంలో దాదాపు ఇంటర్వెల్ దగ్గర ఆమె పాత్ర రివీల్ అవుతుందని, ఆ పాత్ర ఎంట్రీతోనే విజిల్స్ పడే రీతిలో బోయపాటి డిజైన్ చేసారని అంటున్నారు. అలాగే సెకండాఫ్ బాలయ్య ...ఈ పాత్రకు వార్నింగ్ ఇచ్చే సీన్స్ హైలెట్ అవుతాయని చెప్తున్నారు. అయితే రేష్మి ఇంకా పాత్రను ఓకే చేసిందా లేదా అనేది తెలియలేదని, నెగిటివ్ పాత్ర అనగానే ఆమె ఆలోచిస్తోందని అంటున్నారు. తన కెరీర్ కు ఆ పాత్ర ప్లస్ అవుతుందా లేక ముంచేస్తుందా అనే డైలమోలో రేష్మి ఉందని చెప్తున్నారు.
ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. బాలయ్యపై ముహుర్తపు షాట్ షూట్ చేసారు. ఇందులో భాగంగా.. ‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌ను బాలయ్య చెప్పారు.
మరో ప్రక్క కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘రూలర్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ధర్మా అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బాలయ్యకు జంటగా వేదిక, సోనాల్ చౌహాన్ నటించారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్‌లో నిర్వహించనున్నారు.