మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది.. మిగిలిన వాళ్లకు ఆ అర్హత కూడా లేదు: ఆర్జీవీ!

By tirumala ANFirst Published Nov 8, 2019, 3:20 PM IST
Highlights

రాంగోపాల్ వర్మ పేరు చెప్పగానే వివాదాలు గుర్తుకు వస్తాయి. వర్మ, వివాదాలు అనే పదాలు అలా పెనవేసుకుపోయాయి. శివ చిత్రంలో వర్మ క్రియేటివిటీకి దేశం మొత్తం ఫిదా అయింది. ఆ తర్వాత కొన్ని మంచి చిత్రాలు వర్మ దర్శత్వంలో వచ్చాయి. 

ఇటీవల వర్మ క్రియేటివిటీ కంటే వివాదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంట్రవర్షియల్ అంశాలనే తన కథలుగా ఎంచుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా వర్మ దర్శత్వంలో వచ్చిన రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాలు ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చూస్తుంటే ఈ చిత్రం కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కులాలని, ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని, ప్రముఖ రాజకీయ నాయకులని ఈ చిత్రంలో వర్మ చూపించబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీలో విలన్, హీరో ఎవరూ ఉండరని అన్నారు. సన్నివేశాలు మాత్రం బలంగా ఉంటాయని అన్నారు. 

తాను తరచుగా మెగా ఫ్యామిలీపై కామెంట్స్ చేస్తుండడంపై వర్మ స్పందించాడు. ట్విట్టర్ ఉన్నదే మన అభిప్రాయాలు తెలియజేయడానికి. అందులో నేను ఎవరిగురించి అయినా కామెంట్స్ చేస్తాను. ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ గురించే ఎందుకంటే.. మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది. డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ ఓ అమెరికా. 

ఇది విమర్శ కాదు ప్రశంస. ఇక మిగిలిన ఫ్యామిలీల గురించి నేను కామెంట్ చేసే అర్హత కూడా వాళ్లకు లేదు. నేను చిరంజీవి గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా ఇదే కారణం అని వర్మ తెలిపాడు. 

బహుశా నా కామెంట్స్ మెగా ఫ్యామిలీకి అర్థం కావడం లేదేమో.. అందుకే నేను చేస్తున్నవి విమర్శలు అనుకుంటున్నారు. కరణ్ జోహార్ బాలీవుడ్ లో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతుంటే ఓ మాట అన్నా. ఆయన సినిమాలు చూస్తుంటే భయమేస్తోంది అని. వరుస హిట్లు వస్తుండడంతో అలా మాట్లాడా. అది కూడా ప్రశంసే అని వర్మ అన్నారు. 

చిరంజీవి గారంటే నాకు గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని చాలా సార్లు నేనే చెప్పా. కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఉన్నంత బలంగా ఇతర నాయకులు లేరు.. ఇది మాత్రం వాస్తవం అని వర్మ పేర్కొన్నాడు.  

 

 

click me!