ఏడుపొస్తోంది: విశాఖ దుర్ఘటనపై ఆర్.నారాయణ మూర్తి, జగన్ కు సెల్యూట్

By telugu teamFirst Published May 8, 2020, 7:40 AM IST
Highlights

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి స్పందించారు. తనకు ఏడుపొస్తోందని ఆయన అన్నారు. సాయం అందించిన జగన్ కు ఆయన సెల్యూట్ చెప్పారు.

విశాఖ పట్నంలో ఎల్జీ పాలిమార్స్ ఫ్యాక్టరీ నుంచి విష వాయువు లీక్ అవడం అనేక మంది చనిపోవడం వందలాది మంది ఆస్పత్రుల పాలవ్వడం అనేక జంతువులు చనిపోవడం చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అన్నారు. విశాఖ ఎల్జీ పాలీమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై ఆయన స్పందించారు. కరోనా ఎఫెక్ట్ తో యావత్ ప్రపంచం చిన్న భిన్నం అయిపోతున్న సమయంలో ఉత్తరాంధ్రలో ఈ ఘటన జరగడం చాలా హృదయ విదారకమని, ఏడుపొస్తుందని ఆయన అన్నారు. 

మన భారతదేశంలో పివి నరసింహారావు ప్రధానిగా వున్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రి గా వున్నప్పుడు 85... 90.. దశకంలో డబ్లుటీవోతో కుదుర్చుకున్స ఒప్పందాల వల్ల జరిగిన దుష్పరిణామాల్లో ఇదొకటని ఆయన అన్నారు. ఏ బహుళ జాతి కంపెనీలను, ఏ కార్పొరేట్ శక్తులను,ప్రవేట్ శక్తులను అభివృద్ధి పేరుతో మన దేశంలో కి ఆహ్వానిస్తున్నామో...దాని దుష్పరిణామమే ఈరోజు దక్షిణ కొరియా కి సంబంధించిన కంపెనీలో జరిగిన దుర్ఘటన అని నారాయణమూర్తి విశ్లేషించారు. 


ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పచ్చని ఉత్తరాంధ్ర ఉడుకుతోందని, కేవలం కొంత మంది స్వార్ధపరులు అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్రను దుష్పరిణామాలకు ప్రయోగం గా చేస్తున్నారని అన్నారు. ఎల్జీ పాలిమార్స్ సంస్థను ప్రధాని మోడీ నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళ నుంచి కోట్ల రూపాయల నష్ట పరిహారం తీసుకోవాలని అన్నారు. వాళ్ళను శిక్షించి న్యాయం చేయాలని కోరారు. 

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికంగా నష్టపోయిందని,  శ్రీ కృష్ణ కమిటీ రాయలసీమ ఉత్తరాంధ్రా బాగా వెనుకబడిన ప్రాంతాలని చెబుతూ వాటికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్డీఎ ప్రభుత్వం కూడా ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా ఇస్తామని చెప్పిందని అన్నారు. కానీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వకున్న, ప్రత్యేక పాకేజ్ లు ఇవ్వకున్నా ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నవరత్నాలు ప్రకటించారో అవన్నీ సమర్ధంగా అమలు చేస్తున్నారని చెప్పారు. 

కరోనా మహమ్మారి ని తట్టుకొని ప్రజలకు ది బెస్ట్ చేస్తున్నారని ప్రశంసించారు. అలాంటి పరిస్థితుల్లో నిధులున్నాయా లేవా అని కూడా చూడకుండా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి ఆర్ధిక సహాయం ప్రకటించి మానవీయ కోణం చూపిస్తున్నందుకు జగన్ మోహన్ రెడ్డికి నా సెల్యూట్ అని ఆయన అన్నారు. నరేంద్రమోదీ తమకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్రత్యేక ప్యాకేజి ఇవ్వలేదని ఆయన అన్నారు. జాతీయ విపత్తు నిధి నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు నిధులు మంజూరు చేసి జగన్ మోహన్ రెడ్డికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో చేయూ నిచ్చి ఆంధ్ర ప్రదేశ్ ను ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

click me!