
టాలీవుడ్ మోస్ట్ పాపులర్, గోల్డెన్ హాండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి పలు సినిమాలను నిర్మించి.. ఊహించని రేంజ్ లో ఎన్నో ఘన విజయాలను అందుకున్నారు. ఆయన నిర్మించి చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేదు.. ఏ సినిమా అయినా.. ఆయన హ్యాండ్ పడితే.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ హిటే.. బ్లాక్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాల్సిందే. అలాంటి దిల్ రాజు తాజాగా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నట్లుగా ఉన్నాయి.
అసలేం జరిగిందంటే..?
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber Of Commerce)కు ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి అధ్యక్ష పదవి బరిలో దిల్ రాజు ఉన్నారు. ఆయనకు పోటీగా సి. కళ్యాణ్ నిలబడ్డారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిని ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చిన్న, పెద్ద ప్రొడ్యూసర్లందరూ తనను ప్రెసిడెంట్ గా ఉండాలని కోరుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిల్ రాజు బదులిస్తూ.. రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది.. కానీ ఎప్పుడనేది చెప్పలేం. కానీ, తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను రాజకీయాలకంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. తాను ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉంటే.. చిత్రసీమకు మేలు జరుగుతుందని సినీ ఇండస్ట్రీ మిత్రులు కోరుకుంటున్నారని తెలిపారు. సీనియర్ నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయితే తనకు కిరీటం పెట్టరనీ, పైగా తనకు ఇంకా సమస్యలు పెరుగుతాయని అన్నారు. అయితే.. పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేయక తప్పడం లేదని వివరించారు.
ఈ సమయంలో తన ప్యానల్ యాక్టివ్ ప్యానల్ అని దిల్ రాజు వివరించారు. చిత్రసీమలో రెగ్యులర్ గా సినిమాలు నిర్మించే వారందరూ తమ ప్యానల్ లో ఉన్నారని తెలిపారు. వాణిజ్య మండలిని బలోపేతం చేసేందుకు తాము ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి సరైన టీమ్ అవసరమన్నారు. కాగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఇదే సమయంతో ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారనే చర్చ కూడా సాగుతోంది.